- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు నిలిపివేసేందుకు కాంట్రాక్టర్ల సన్నద్ధం
తెలంగాణలో ఇసుక తవ్వకాలు బంద్ అయ్యే ఛాన్స్.. 9 నెలలుగా రూ. 120 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టడంతో కాంట్రాక్టర్ల అసోసియేషన్ తీవ్ర నిర్ణయం.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లు మూసివేయాలని తెలంగాణ సాండ్ మైనింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత 9 నెలల నుంచి రావాల్సిన రూ. 120 కోట్ల బకాయిలు, పెండింగ్, రన్నింగ్ బిల్లుల రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని గుత్తేదారులు రీచ్‌లను మూసివేసేందుకు సిద్ధమవుతున్నారు. ఐదారు రోజుల క్రితం 50 మంది కాంట్రాక్టర్లు టీజీఎండీసీ కార్యాలయంలో ఎండీని కలిసి బకాయిలు విడుదల చేయకపోతే తాము రీచ్‌లను నడపలేమని స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి ఏటా రూ. 1100 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా తమకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వాగుల నుంచి ఇసుక తరలింపు క్రమంలో ధ్వంసమైన రోడ్ల మరమ్మతు పనులు చేపట్టడంతో రోజుకు కనీసం రూ. 10 వేల వరకు తమకు ఖర్చు అవుతున్నదని తెలిపారు. వీటితోపాటు స్థానిక సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులకు నెలవారీ మామూళ్లు ఇవ్వడం తప్పడం లేదన్నారు.
గత సెప్టెంబర్ నుంచి..
ప్రభుత్వం లారీల యాజమానుల నుంచి తీసుకునే డీడీ నుంచి తమకు రూ. 1600 నుంచి రూ. 1800 వరకు వస్తున్నట్లు కాంట్రాక్టర్లు చెప్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్నుంచి ఇవ్వకపోవడంతో ఏవిధంగా వ్యాపారం సాగిస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఇసుక తవ్వకాలను నిలిపివేసే ముందు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులకు ఆన్ లైన్‌లో ఇసుక నిల్వల వివరాలు అప్‌లోడ్ చేయకూడదని చెప్పినట్టు తెలిసింది. పెండింగ్ బిల్లులతోపాటు ప్రతి 15 రోజుకోసారి రన్నింగ్ బిల్లులు ఇస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం జరగడం లేదని సాండ్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
నాలుగు నదుల నుంచి తరలింపు..
రాష్ట్రంలోని 11 జిల్లాల్లో గోదావరి, మంజీరా, కృష్ణా, తుంగభద్ర నదుల్లో అధికారిక, అనధికారికంగా సుమారుగా 95 ఇసుక క్వారీలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 12, ఉమ్మడి వరంగల్‌లో 9, కరీంనగర్‌లో 6 ఉండగా, ఖమ్మం, మంచిర్యాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇసుక కావాల్సిన వారు క్యూబిక్ మీటర్ ఇసుకకు ఆన్లైన్చెల్లిస్తే ఆ మేరకు ప్రభుత్వం ఆర్డర్ కాపీ ఇస్తుంది. ఈ కాపీ తీసుకుని రీచ్‌కు వెళ్తే కాంట్రాక్టర్ సిబ్బంది జేసీబీల ద్వారా లారీలో ఇసుకను నింపుతారు. ఈ విధంగా యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటుకు ప్రభుత్వం గుత్తేదారుకు క్యూబిక్ మీటర్‌కు రూ.120 చొప్పున చెల్లిస్తోంది. గిరిజన సొసైటీల నిర్వహణలో ఉంటే వాటికి క్యూబిక్ మీటర్‌కు రూ.250 చొప్పున ఇస్తోంది. ఈ క్రమంలో రీచ్ల వద్ద మైనింగ్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి ఉంటారు. వీటి ఆధ్వర్యంలో ఇసుక రవాణా జరుగుతుంది.
మైనింగ్ శాఖకు భారీగా ఆదాయం..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇసుక కొరత తీర్చడానికి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కొత్తగా నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించింది. సన్న ఇసుక టన్ను రూ. 1800, దొడ్డు ఇసుక రూ. 1600 చొప్పున విక్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, ఆదిభట్ట, భౌరంపేటలో ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించింది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల రీచ్‌ల నుంచి ఇసుక వస్తుండగా వర్షాకాల కొరతను ఈ బజార్లు తీరుస్తాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో పరిసర ప్రాంతాల్లో ఇసుక కొరత నిర్మాణ రంగంలో పెద్ద సమస్యగా మారింది. సరఫరాలో జాప్యం, అధిక ధరలు, అక్రమ రవాణా వంటి సమస్యల వల్ల నిర్మాణ ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి. ఇసుక బజార్ల ఏర్పాటుతో సొంతంగా ఇళ్లు నిర్మించుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంది. అలాగే ఇసుకు బజార్ల ద్వారా మైనింగ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతుంది.






