తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాలు.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి పరీక్ష

by Malleboina Mahesh |

కామారెడ్డిలో షబ్బీర్ అలీ - గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి - స్థానిక నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాలు.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి పరీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార కాంగ్రెస్ పార్టీలో చాలా జిల్లాలు, నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు, వర్గపోరు, ముఠా తగాదాలు రాజుకుంటున్నాయి. చాలా వివాదాలు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకొచ్చాయి. నేతలకు షోకాజ్ నోటీసులు పంపించి వారి నుంచి వివరాలు సేకరించింది. గొడవలు సద్దుమణగని ఘటనలపై పరిశీలకులను నియమించి సమన్వయం చేసింది. చాలా వరకూ ఆయా గొడవలు దాదాపు సమసిపోయాయి. కానీ, ఇటీవల క్రమశిక్షణ కమిటీ ముందుకొచ్చిన పాలకుర్తి, కామారెడ్డి నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు మాత్రం ఎడతెగని పంచాయితీలుగా మారాయి. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వర్గపోరు ముదిరి గాంధీభవన్ కు చేరింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీ ఓడిపోయారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు హోదాలో ఆయన ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ తరఫున యాక్టివ్ గా ఉన్నారు. దీంతో షబ్బీర్ అలీకి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వర్గపోరు మొదలైందని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ​మల్లు రవిని కలిసి షబ్బీర్ అలీపై ఫిర్యాదు చేశారు. అంతకుముందు వారు గాంధీ భవన్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ అంశంపై చంద్రశేఖర్ రెడ్డికి ఈనెల 11 లోపు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

పాలకుర్తిలో వర్గపోరు

గత అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి సంచలనం సృష్టించిన యశస్విని రెడ్డికి కొంత కాలం తర్వాత స్థానిక నేతలతో విభేదాలు పొడసూపాయి. యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పైన స్థానిక నేతలు అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. గత పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎమ్మెల్యే, ఝాన్సీ రెడ్డి పై పార్టీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రెండు వర్గాల మధ్య తొర్రూర్ మున్సిపల్ ఫలితం ఆజ్యం పోసింది. ఇక్కడ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి స్థానిక నేతలు హరిప్రసాద్ రెడ్డి, కృష్ణకిషోర్‌ కారణమని క్రమశిక్షణ కమిటీకి యశస్వినీ రెడ్డి ఫిర్యాదు చేశారు.

మరోవైపు హరి ప్రసాద్ రెడ్డి, కృష్ణ కిషోర్ వర్గం కూడా ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పై ఆరోపణలు చేసింది. ఈ వివాదంపై జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి, జిల్లా సీనియర్ నేతలతో కూడా ఈ అంశంపై మాట్లాడతారని ఇటీవల క్రమశిక్షణ కమిటీ చెప్పింది. మరోవైపు పాలకుర్తి వివాదంపై పరిశీలకుడిగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను నియమించినట్టు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఈ వివాదాలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీ వర్గాలు చెప్పాయి.

Next Story