కేంద్ర నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా కేసముద్రంలో కాంగ్రెస్ మహాధర్నా

by Ratna Kumari |

ప్రజల సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆరోపించారు.

కేంద్ర నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా కేసముద్రంలో కాంగ్రెస్ మహాధర్నా
X

దిశ, కేసముద్రం : ప్రజల సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిర్వహించిన మహాధర్నాలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని అన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిపక్షంగా ప్రశ్నించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ప్రజలు సంఘటితంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను విరమించి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, నాయకులు గుగులోత్ దసురు నాయక్, అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు, నీలం దుర్గేష్, బండారు దయాకర్, బండారు వెంకన్న, మార్కెట్ డైరెక్టర్లు అయ్యూబ్ ఖాన్, వసంతరావు, కదిరె సురేందర్, తండా వెంకటేశ్వర్లు, బనిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story