- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ సర్కార్‌వి పిరికిపంద చర్యలు.. బీఆర్ఎస్ నేతల అరెస్టులపై కేటీఆర్ ఫైర్
బీఆర్ఎస్ నేతల అరెస్టులపై కేటీఆర్ ఆగ్రహం! కాంగ్రెస్ చర్యలను పిరికిపంద చర్యలుగా అభివర్ణన. భూసేకరణ ఆపాలని, నేతలను విడుదల చేయాలని డిమాండ్.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సర్కార్‌వి పిరికిపంద చర్యలు అంటూ బీఆర్ఎస్ నేతల అరెస్టుల (Arrests of BRS leaders)పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా గృహ నిర్బంధం చేయడం, అరెస్టులు చేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరును 'పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ సహా పలువురు నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
"అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేమీ కాదని. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇలాంటి ఎన్నో ఆంక్షలను మేం ఎదుర్కొన్నాం. ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడతాం" అని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం ద్వారా ప్రభుత్వం తన బలహీనతను బయటపెట్టుకుంటోందని విమర్శించారు. అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడాన్ని తక్షణమే నిలిపివేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. రైతుల అనుమతి లేకుండా, వారిని ఇబ్బందులకు గురి చేస్తూ సాగిస్తున్న ఈ ప్రక్రియను బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, బాధితులకు అండగా ఉంటామని ఆయన పునరుద్ఘాటించారు.






