తెలంగాణ సొమ్ముతో కేరళలో కాంగ్రెస్ 'డబ్బా' ప్రచారం.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

by Malleboina Mahesh |

తెలంగాణ ప్రజాధనంతో కేరళలో కాంగ్రెస్ ప్రకటనల పర్వంపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో హామీలు అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో కోట్లు ఖర్చు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ సొమ్ముతో కేరళలో కాంగ్రెస్ డబ్బా ప్రచారం.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి విచ్చలవిడిగా మళ్లిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరుగుతున్న ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంల ఫోటోలతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత" అన్నట్లుగా రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కల్లబొల్లి మాటలు చెబుతున్న ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాల్లో మాత్రం తెలంగాణ ప్రజాధనాన్ని మంచినీళ్లలా పారబోస్తోందని ధ్వజమెత్తారు.

అలాగే రాష్ట్రంలోని మహిళలు, యువతను కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా వంచించిందని హరీశ్ రావు విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2500, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలు అమలు చేయకుండా ఇక్కడి ఆడబిడ్డల కంట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. కానీ, కేరళలో మాత్రం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామంటూ పచ్చి అబద్ధాలతో దొంగ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాల ఊసే లేదని, నోటిఫికేషన్ల కోసం రోడ్డెక్కిన విద్యార్థులపై అర్ధరాత్రులు లాఠీలతో విరుచుకుపడుతున్నారని ఈ సందర్భంగా హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతాంగం, సామాజిక పింఛన్ల విషయంలోనూ ప్రభుత్వం మాట తప్పిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో పండుగలా సాగిన రైతుబంధును ఆపేసి, రుణమాఫీ పేరుతో సగానికి పైగా రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. రైతు భరోసా, వరికి రూ. 500 బోనస్ వంటి హామీలు గాలికొదిలేశారని విమర్శించారు. అలాగే, ఎన్నికల ముందు రూ. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు వృద్ధులను, వికలాంగులను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ సంక్షేమ పథకాలకు నిధులు లేవని చెప్పే రేవంత్ రెడ్డికి, కేరళలో అబద్ధపు ప్రకటనలు ఇవ్వడానికి చేతులెలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.

ఈ ప్రజాధనం దోపిడీ కేవలం కేరళకే పరిమితం కాలేదని, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణ ఖజానాను కాంగ్రెస్ పార్టీ అక్షయ పాత్రలా వాడుకుంటోందని హరీశ్ రావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ 'ఫేక్ పబ్లిసిటీ' ట్రాప్‌లో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఈ దొంగ ప్రచారాలను ఆపాలని, ప్రకటనల కోసం ఖర్చు చేసిన వందల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచే ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన ఆయన డిమాండ్ చేశారు.

Next Story