మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ నినాదం

by Malleboina Mahesh |   (  Updated:2026-01-25 08:08:00  IST  )

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ నినాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామనే సంకేతాలను ఇచ్చేలా కార్యక్రమాలను చేపట్టేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈనెల చివరన లేదా వచ్చేనెల మొదటివారంలో హైదరాబాద్‌లో జాతీయస్థాయి ఓబీసీ మహాసభ నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. సభకు అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. వారితో బీసీ రిజర్వేషన్లపై పార్టీ పరంగా మరోసారి ప్రజలకు స్పష్టత ఇప్పించే యోచనలో ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే ఇదే వేదికగా బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందనే విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలని నిర్ణయించారు.

పార్టీ పరంగా 42 శాతం సీట్లు..

మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరుగనున్నందున పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరే విధంగా వ్యూహరచన చేయాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. 2029 ఎన్నికల్లో పార్టీ గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రిజర్వేషన్లపై న్యాయం జరుగుతుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓబీసీ సమావేశంలో టీపీసీసీ చీఫ్​మహేశ్‌కుమార్ గౌడ్ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. బీసీలకు తమ పార్టీ పెద్దపీట వేస్తోందని, టీపీసీసీ కార్యవర్గంలో 50 శాతం బీసీలకు, ఉపాధ్యక్షులు 68 శాతం, జనరల్ సెక్రటరీల్లో 70 శాతం, డీసీసీ చీఫ్‌ల భర్తీలో 17 జిల్లాల్లో బీసీలను నియమించామని వెల్లడించారు. అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన బీసీ వర్గాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ భావిస్తోందని స్పష్టం చేశారు.

READ MORE ....

మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Next Story