మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌ పీఠాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల గురి

by Malleboina Mahesh |

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌ పీఠాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల గురి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. హంగ్‌ పరిస్థితులు నెలకొన్న మొయినాబాద్‌, పరిగి మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ రంగంలోకి దిగింది. మరోపక్క.. ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మెజార్టీ ఉన్నప్పటికీ ఎప్పుడు..ఏం జరుగుతుందో! అన్న భయం రాజకీయ పార్టీలను వెన్నాడుతోంది. దీంతో గెలిచిన అభ్యర్థులను ఆయా పార్టీలు రహస్య ప్రాంతాలకు తరలించాయి. అక్కడక్కడా ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌ పదవుల విషయంలో సొంత పార్టీలోనే చీలికలు రాగా.. క్యాంపులోనే వాటికి చెక్‌ పెట్టే దిశగా నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల ఎక్స్​​‍ఆఫీషియో సభ్యుల ఓట్లు తుది ఫలితాన్ని నిర్ణయించే స్థితిలో ఉండడంతో మున్సిపల్‌ రాజకీయం రసవత్తరంగా మారింది.

‘హంగ్‌’ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ గురి

మొయినాబాద్‌, పరిగి మున్సిపాలిటీలలో ఏ పార్టీకి కూడా మెజార్టీ స్థానాలు రాకపోవడంతో హంగ్‌ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎలాగైనా..ఈ రెండు మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మొయినాబాద్‌ మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను కాంగ్రెస్ 10 వార్డులను, బీఆర్‌ఎస్ 7 వార్డులను, బీజేపీ 4 వార్డులను, స్వతంత్రులు 5 వార్డులను గెలుచుకున్నారు. ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు రాలేదు. మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం కాంగ్రెస్ 4 సీట్ల దూరంలో, బీఆర్‌ఎస్ 7 సీట్ల దూరంలో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో ఇద్దరు కాంగ్రెస్ రెబల్‌ అభ్యర్థులు, మరో ఇద్దరు బీజేపీ రెబల్స్​‍ అభ్యర్థులు ఉన్నారు.

ఇప్పటికే అధికార పార్టీ గెలిచిన అభ్యర్థులతో క్యాంపు నిర్వహిస్తోంది. స్వతంత్రులతో అధికార కాంగ్రెస్ పార్టీ మంతనాలు జరుపుతోంది. మరోవైపు ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఇది కొలిక్కి వస్తే..దాదాపు ఛైర్మన్‌ పీఠం కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉంది. పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చెరో 8 వార్డులను గెలుచుకున్నాయి. ఇద్దరు స్వతంత్రుల మద్దతు పైనే ఇక్కడి ఫలితం తేలనుంది. అయితే స్వతంత్రుల ఆచూకీ లేకపోవడంతో ఏ పార్టీ చెంతకు చేరారన్న విషయమై గోప్యత నడుస్తోంది. ఏది ఏమైనా ఈ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకునేలా పావులు కదుపుతోంది.

అప్రమత్తమైన అన్ని పార్టీలు

*ఆమన్‌ గల్‌ మున్సిపాలిటీలో 15వార్డులకు గాను బీఆర్‌ఎస్ 8 వార్డులను, బీజేపీ 6 వార్డులను గెలుచుకోగా..కాంగ్రెస్ ఒక్క వార్డునే గెలుచుకుంది. బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ బీజేపీ సైతం ఛైర్మన్‌ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఒక్క సీటు, ఎక్స్​​ఆఫీషియో ఓటు‌తో పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు టాక్‌ విన్పిస్తుండడంతో ముందు జాగ్రత్తగా బీఆర్‌ఎస్ పార్టీ గెలిచిన అభ్యర్థులను క్యాంప్‌ కు తరలించింది.

*షాద్‌ నగర్‌ మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 15 వార్డులను కాంగ్రెస్, 11 వార్డులను బీఆర్‌ఎస్ పార్టీలు కైవసం చేసుకోగా.. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు చెరో వార్డులో గెలుపొందారు. ఇక్కడ ఛైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ ఉంది. కానీ..ఇందులో ఎవరైనా చేజారి పోతే..తలకిందులయ్యే ప్రమాదం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించింది. ఎక్స్ అఫీషియో ఓట్లతో ఛైర్మన్‌ పీఠం దక్కించుకునే దిశగా బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తున్నదన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది.

*ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను బీఆర్‌ఎస్ 13 వార్డులను, కాంగ్రెస్ 8 వార్డులను, బీజేపీ 2 వార్డులను గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి సైతం బీఆర్‌ఎస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్ బలం 14కు చేరింది. అయితే ఎక్స్​​అఫిషియో ఓట్లతో ఫలితాలను కాంగ్రెస్ పార్టీ తారుమారు చేసే అవకాశం ఉందన్న భయంతో బీఆర్‌ఎస్ పార్టీ గెలిచిన అభ్యర్థులందరినీ దూర ప్రాంతానికి తరలించింది. అయితే ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌ విషయంలో క్యాంపులోనే బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య చీలిక వచ్చిందన్న ప్రచారం సోషల్‌ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బీఆర్‌ఎస్ పార్టీ ఖండిస్తోంది. అంతా కలిసికట్టుగానే ఉన్నట్లుగా ఓ ఫోటోను సైతం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

*శంకర్‌ పల్లి మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో కాంగ్రెస్ 9 వార్డులను, బీఆర్‌ఎస్ 4 వార్డులను, స్వతంత్రులు 2 వార్డులను గెలుచుకున్నారు. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులంతా ఇప్పటికే క్యాంపులో ఉండగా..బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు కూడా ఇదే క్యాంపులో ఉన్నట్లు తెలిసింది. అయితే ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్ల విషయంలో ఎమ్మెల్యే ఒకరిని ప్రతిపాదిస్తుండగా.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జి భీం భరత్‌‌లు మరో పేరును ప్రతిపాదిస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి ఏకాభిప్రాయం దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story