బస్తీ ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య సేవలు అందించాలి: డీఎంహెచ్‌వో

by Jakkula.Mamatha |

హైదరాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ ఆదివారం మెట్టుగూడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని చింతబావి బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

బస్తీ ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య సేవలు అందించాలి: డీఎంహెచ్‌వో
X

దిశ, సికింద్రాబాద్: హైదరాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ ఆదివారం మెట్టుగూడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని చింతబావి బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను పరిశీలించేందుకు నిర్వహించిన ఈ తనిఖీలో దవాఖాన పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టరు, రోగుల రికార్డులు, ఔషధాల నిల్వలు, లభ్యత, వైద్య సేవల నిర్వహణతో పాటు దవాఖానలో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం డా. పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బస్తీ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. దవాఖాన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు, పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య ప్రమాణాలను కచ్చితంగా అమలు చేసి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు. బస్తీ దవాఖానల ద్వారా సామాన్య ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story