- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై రోజుకు 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి : సీఎండీ డి.కృష్ణ భాస్కర్
నిర్దేశిత లక్ష్యాల సాధనతో పాటు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సింగరేణి సీఎండీ డి. కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నిర్దేశిత లక్ష్యాల సాధనతో పాటు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సింగరేణి సీఎండీ డి. కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. నాణ్యత ఉన్న బొగ్గును మాత్రమే వినియోగదారులు కోరుతున్నారని, ఈ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను సీఎండీ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన బొగ్గు ఉత్పత్తి, రవాణా, నాణ్యత తదితర అంశాలపై సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బొగ్గు మార్కెట్లో నేడు వినియోగదారులు తమకు అవసరమైన నాణ్యత గల బొగ్గును మాత్రమే స్వీకరిస్తున్నారని, కాబట్టి బొగ్గు పరిమాణం కన్నా బొగ్గు నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ అధికారి, ఉద్యోగి ఈ దిశగా శ్రమిస్తేనే సంస్థకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ ఏడాది పలు కారణాల వల్ల నెలవారీ ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కొంత వెనుకబడి ఉన్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ప్రతీ రోజూ కనీసం 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.40 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 15.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల జనరల్ మేనేజర్లు తమ ఏరియాల్లో సాగుతున్న ఉత్పత్తి ప్రక్రియను వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) గౌతమ్ పొట్రు, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్ మెంట్) బి. వెంకన్న, జీఎం (కో ఆర్డినేషన్ & మార్కెటింగ్) టి. శ్రీనివాస్, కార్పోరేట్ జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు, అధికారులు పాల్గొన్నారు.
- Tags
- SCCL






