- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మరోసారి ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం
అంచనాలను మించిన కాంగ్రెస్ విజయం: సీఎం రేవంత్ వ్యూహం సక్సెస్.. అత్యధిక మున్సిపాలిటీల్లో ఎగిరిన హస్తం జెండా! ప్రతిపక్షాలకు దక్కని పీఠాలు.

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యధిక మున్సిపల్‌చైర్మన్, మేయర్ స్థానాలను దక్కించుకోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. తాము అంచనా వేసినదానికంటే ఎక్కువగానే సీట్లను సాధించామని చెబుతున్నారు. సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ 90కి పైగా చైర్మన్, మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు సమిష్టిగా పనిచేయడంతో మెరుగైన ఫలితాలు సాధించామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్‌లో ఎంఐఎం సహకరించడంతో మేయర్ పీఠం దక్కించుకున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కరీంనగర్‌లో ఓట్లు ఎక్కువ పార్టీలకు చీలడంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, లేదంటే మేయర్ ఫలితం మరో విధంగా ఉండేదని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా తాజా ఫలితాలతో హస్తం శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొన్నది.
ఎప్పటికప్పుడు సీఎం దిశానిర్దేశం
సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలపై అక్కడి నుంచే జూమ్ మీటింగ్‌తో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. అంతకుముందే ఖమ్మం, పాలమూరు, ఆదిలాబాద్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. కేడర్‌కు, నాయకులకు పార్టీ లక్ష్యాన్ని స్పష్టంగా వివరించారు. దీంతో కేడర్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పని చేయడంతో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను గుర్తించి అవి మళ్లీ జరగకుండా సీఎం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏదేమైనా గెలిచి తీరాలని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆదేశాలు జారీ చేయడంతో వారు సైతం క్షేత్రస్థాయికి వెళ్లి మరింత అప్రమత్తంగా వ్యవహరించారు.
ఏ అవకాశాన్నీ వదలకుండా
ఎన్నికల ఫలితాల తర్వాత చైర్మన్, మేయర్ పీఠాల విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో మరోసారి సమావేశమై చర్చించి అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుని సక్సెస్ అయింది. మొత్తంగా అధికార పార్టీ అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకున్నది. ఏడు కార్పొరేషన్‌లలో సీపీఐ, ఎంఐఎం సహకారంతో ఆరింటిలో పాగా వేయగలిగారు. స్పష్టమైన మోజార్టీ ఉన్న దగ్గర మినహా మిగిలిన చోట్ల స్థానాలను ప్రతిపక్షాలకు దక్కకుండా చేయడంలోనూ కొంతమేర సక్సెస్ అయ్యామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. పట్టణాల్లో ఎంఐఎం, బీజేపీ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అయితే బీజేపీ ఓట్లు తెచ్చుకోగలిగినా సీట్లను, చైర్మన్ స్థానాలను అనుకున్న స్థాయిలో దక్కించుకోలేకపోయిందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.






