- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శభాష్ హైడ్రా టీమ్’.. CM రేవంత్ ప్రశంస
మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పని చేస్తున్న పలువురు ఇంజనీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకోగా.. రంగంలోకి దిగి, వారి ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పని చేస్తున్న పలువురు ఇంజనీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకోగా.. రంగంలోకి దిగి, వారి ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. హైదరాబాద్ మహానగర ఆస్తులు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో హైడ్రా పోషిస్తున్న పాత్ర అభినందనీయమంటూ ఆయన కొనియాడారు.
డీఆర్ఎఫ్ సిబ్బందికి కమిషనర్ సన్మానం..
మీరాలం చెరువులో చిక్కుకుపోయిన 9 మందిని కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అభినందించారు. క్యాష్ అవార్డుతో పాటు.. శాలువా కప్పి.. ప్రశంసా పత్రంతో వారిని మంగళవారం సన్మానించారు. మీరాలం చెరువు అభివృద్ధి పనులకోసం వెళ్లి చిక్కుకుపోయిన 9 మందిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందం ఆదివారం అర్ధరాత్రి కాపాడిన విషయం విధితమే. బోటును మెల్లగా నెట్టుకొద్దామని ప్రయత్నించినా.. చెరువులో దట్టంగా వున్న గుర్రపు డెక్క బోటు ను ముందుకు కదలనీయలేదు. ఒకపక్క చెరువులో ఉన్న మొసళ్ల భయం, మరోపక్క ఒడ్డుకు చేరే అవకాశం లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయాందోళనకు గురైన వారిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందం సాహసోపేతంగా కాపాడిన తీరు అభినందనీయమని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అన్నారు. హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఫోను వచ్చిన నుంచి మొత్తం 9 మంది కార్మికులను కాపాడిన వరకూ ఎమి జరిగిందో ఈ సందర్భంగా హైడ్రా రెస్క్యూ టీమ్ ఇన్‌ఛార్జి పెమ్మాడి స్వామి, ఎస్ఎఫ్వో మహ్మద్ జమీల్ ఈ సందర్భంగా వివరించారు. ఒక వైపు చీకటి.., చెరువులో మొసళ్ల భయం వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా రక్షణ చర్యలు చేపట్టిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందం సభ్యులు నిజమైన ‘ఆపదమిత్రులు’గా నిలిచారని కమిషనర్ అభినందించారు. సంఘటన సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందించి, బాధితులతో నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతూ ధైర్యం చెప్పి, వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం ప్రశంసనీయమన్నారు. హైడ్రా ఎస్ఎఫ్వో మహ్మద్ జమీల్, డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ ఇన్‌ఛార్జి పెమ్మాడి స్వామి, డీఆర్ఎఫ్ అసిస్టెంట్లు జి. రాణాప్రతాప్, ఎస్. రమేష్, జెట్టా శ్రీనివాస్, బుట్టా బాలరాజ్, ఎ. మహేష్, ఆసిఫ్ పాషా,కె. అనిల్ కుమార్ కమిషనర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వారిలో ఉన్నారు.
పెమ్మాడి స్వామికి ప్రత్యేక అభినందనలు..
మీరాలం చెరువులో 9మందిని కాపాడిని ఘటనలోనే కాకుండా.. హైడ్రా మేజర్ ఆపరేషన్లలో చురుకైన పాత్ర పోషించిన హైడ్రా రెస్క్యూటీమ్ సూపర్‌వైజర్ పెమ్మాడి స్వామిని కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. 2025 ఏప్రిల్ నెలలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి మూసీలో వరద పోటెత్తడంతో మధ్యలో ఉన్న ఆలయంలో చిక్కుకున్నవారిని కూడా హైడ్రా కాపాడింది. పరీక్షలో ఫెయిల్ అయినందున ఆత్మహత్య చేసుకోడానికి క్వారీలో దూకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని కూడా కాపాడారు. హుస్సేన్ సాగర్‌లో బోటు ద్వారా టపాసులు కాల్చే సమయంలో జరిగిన ప్రమాదంలో నీళ్లలో దూకి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నించిన వ్యక్తిని కూడా హైడ్రా కాపాడింది. ఇలా పలు సందర్భాల్లో ప్రాణాలు కాపాడిన ఘటనల్లో స్వామి చురుకైన, ప్రధాన పాత్ర పోషించారంటూ హైడ్రా కమిషనర్ అభినందించారు.






