పుర‘పోరు’పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. మంత్రులకే అభ్యర్థుల గెలుపు బాధ్యతలు

by Kema Shiva Kumar |

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

పుర‘పోరు’పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. మంత్రులకే అభ్యర్థుల గెలుపు బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఒక్కో మంత్రిని రెండు మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా నియమించి, ఆ పరిధిలోని మున్సిపాల్టీలను గెలిపించే బాధ్యతలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏ మంత్రికి ఏఏ నియోజకవర్గాలు ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు చేసినట్లు సమాచారం. ఈ నెల 18న మేడారంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ మంత్రులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఎన్నికలు పూర్తయ్యే వరకు ఫీల్డ్‌లోనే

వచ్చేవారం ఎన్నికల షెడ్యూలును ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. దీంతో షెడ్యూల్ విడుదలైన వెంటనే సొంత నియోజకవర్గంలోని మున్సిపాల్టీలతో పాటు, తమకు అప్పగించిన మున్సిపాల్టీలపై మంత్రులు ఫోకస్ పెట్టేవిధంగా సీఎం రేవంత్ క్యాలెండర్ తయారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కొందరు మంత్రులతో మున్సిపల్ స్ట్రాటజీపై డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న మేడారంలో జరిగే కేబినెట్ సమావేశంలో పాలనా అంశాలపై చర్చించిన తరువాత మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 19న సీఎం రేవంత్ మేడారంలో నూతనంగా నిర్మించిన సమ్మక్క-సారక్క గద్దెలను ప్రారంభించిన అనంతరం ఆయన దావోస్‌ వెళ్లనున్నారు. దీంతోపాటు అమెరికాలో పర్యటించి ఫిబ్రవరి 2న తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన వచ్చేలోపు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ఈలోపు అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తీరుపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకు మంత్రులు తమకు అప్పగించిన మున్సిపాల్టీలో నిత్యం పర్యటిస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాల్సి ఉంటుంది.

రెబల్స్‌ను బుజ్జగించాల్సింది వారే..

షెడ్యూల్ నుంచి పోలింగ్ వరకు ఏ రోజు ఏం చేయాలి? అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండాలి? రెబల్స్ లేకుండా ఏ ప్లాన్ అమలు చేయాలి? అనే అంశాలపై వివరించనున్నారు. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోకపోవడంతో రెబల్స్ పోటీ చేశారు. దీనితో కొన్ని చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. కార్పొరేటర్, కౌన్సిలర్‌గా టికెట్లు దక్కని లీడర్లు రెబల్స్‌గా దిగడం సహజం. ఆలాంటి వారిని పోటీ నుంచి తప్పించేందుకు ప్రత్యేకంగా మంత్రులు చొరవ తీసుకుని, రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సంకేతాలను సీఎం ఇవ్వనున్నట్లు తెలిసింది.

బీఆర్ఎస్, బీజేపీ పట్టున్న చోట స్పెషల్ ఫోకస్

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీకి పట్టుంది. అక్కడ తమ ఉనికిని కాపాడుకునేందుకు కమలం నేతలు మున్సిపల్ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపోల్స్ బాధ్యతలను ఆ మూడు జిల్లాలకు చెందిన మంత్రులతో పాటు సీనియర్ లీడర్లకు అప్పగించాలని భావిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ బలంగా ఉన్న మున్సిపాల్టీల బాధ్యతలను ప్రస్తుతం సీనియర్ మంత్రులకు అప్పగించే చాన్స్ ఉంది.

Next Story