ఢిల్లీ యూనివర్సిటీ ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు?

by Malleboina Mahesh |

ఢిల్లీ యూనివర్సిటీ ఆర్ట్స్ ఫ్యాకల్టీలో ఏబీవీపీ, ఐసా గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. మహిళా జర్నలిస్టుపై దాడి జరిగిందని ఏబీవీపీ ఆరోపించగా, తమ కార్యకర్తలపై దాడి జరిగిందని ఐసా కౌంటర్ ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ యూనివర్సిటీ ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు?
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని నగరం అయిన ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలోని ఆర్ట్స్ ఫ్యాకల్టీ క్యాంపస్‌లో ఏబీవీపీ (ABVP), ఐసా (AISA) విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఒక నిరసన కార్యక్రమం సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు తోపులాట, పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.

జర్నలిస్టుపై దాడి జరిగిందన్న ఏబీవీపీ

క్యాంపస్‌లో జరుగుతున్న ఒక నిరసనను కవర్ చేయడానికి వచ్చిన 'రుచి తివారీ' అనే మహిళా జర్నలిస్ట్ పై వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు దాడి చేశారని ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సార్థక్ శర్మ వెల్లడించారు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఆమెను మ్యాన్ హ్యాండిల్ చేశారని ఏబీవీపీ ఆరోపించింది. అసలు వీరంతా యూనివర్సిటీ విద్యార్థులు కారని, బయట నుంచి వచ్చిన వారే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.

మా సభ్యులను కొట్టారంటున్న ఐసా

ఇదిలా ఉంటే యూజీసీ (UGC) కొత్త నిబంధనలపై తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా, రైట్ వింగ్ విద్యార్థి సంఘాల వారు తమపై దాడి చేశారని ఐసా ఆరోపించింది. తమ సంఘం డీయూ కార్యదర్శి 'అంజలి' పై భౌతిక దాడి జరిగిందని, జర్నలిస్టును కాపాడే ప్రయత్నంలో ఆమెకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. పోలీసు స్టేషన్ వద్ద కూడా తమను బెదిరించారని, భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ దాడిని అడ్డుకోలేకపోయారని ఐసా నేతలు ఆరోపిస్తున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనపై మారిస్ నగర్ పోలీసులకు ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. పోలీసులు ఇప్పటికే బాధితులకు వైద్య పరీక్షలు (MLC) నిర్వహించారు. ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్ వద్ద పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Next Story