- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు ప్రయాణం ఎప్పుడో?.. ‘పెద్ది’ సినిమాతో మళ్లీ చర్చల్లోకి చౌటుప్పల్ 'రైలు కూత'!
చౌటుప్పల్ పేరు చెబితే అభివృద్ధి, పరిశ్రమలు, జాతీయ రహదారి, విద్యా సంస్థలు, వ్యాపార అవకాశాలు గుర్తుకు వస్తాయి.

దిశ, చౌటుప్పల్ టౌన్: చౌటుప్పల్ పేరు చెబితే అభివృద్ధి, పరిశ్రమలు, జాతీయ రహదారి, విద్యా సంస్థలు, వ్యాపార అవకాశాలు గుర్తుకు వస్తాయి. కానీ ఈ ప్రాంత ప్రజల మనసుల్లో ఎన్నో ఏళ్లుగా ఒక కల మాత్రం నెరవేరడం లేదు. అదే.. చౌటుప్పల్‌కు రైల్వే మార్గం, 'రైలు కూత'. రైలు ప్రయాణం అంటే ఎంతో మందికి ఓ మధుర అనుభూతి. రైలు గేటు పడటం, పట్టాలపై రైలు దూసుకుపోవడం, స్టేషన్‌లో ప్రయాణికుల సందడి చూడటం ప్రత్యేకమైన అనుభవాలు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది రైలు ప్రయాణం చేసే అవకాశం పొందలేదు. ఇటీవల విడుదలైన హీరో రామ్ చరణ్ నటించిన "పెద్ది" సినిమా ఈ అంశాన్ని మరోసారి గుర్తు చేసింది.
సినిమాలో కొండల మధ్య ఉన్న ఓ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. ప్రభుత్వ గుర్తింపు లేదు. కానీ ఆ గ్రామం పక్కగానే ప్రతిరోజూ రైలు వెళ్తూ ఉంటుంది. గ్రామ ప్రజల కోసం రైలు ఆగించాలని "అప్పలసూరి" అనే పెద్దాయన మూడు దశాబ్దాల పాటు పోరాడతాడు. చివరకు అతని ఆశయాన్ని హీరో ముందుకు తీసుకెళ్లి ఆ గ్రామానికి గుర్తింపు తీసుకు రావడానికి కృషి చేస్తాడు. సినిమాలో చూపిన ఆ గ్రామ పరిస్థితులకు చౌటుప్పల్‌కు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, ఒక విషయంలో మాత్రం పోలిక కనిపిస్తుంది. అన్ని సౌకర్యాలు ఉన్న చౌటుప్పల్‌కు ఇప్పటికీ రైల్వే కనెక్టివిటీ లేకపోవడం ప్రజలను ఆలోచింపజేస్తోంది.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వ్యూహాత్మకంగా ఉన్న చౌటుప్పల్ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. రోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తున్నారు. అయినప్పటికీ రైల్వే సౌకర్యం అందుబాటులో లేకపోవడం ప్రాంత అభివృద్ధికి ఒక లోటుగానే మిగిలింది. ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, స్థానిక నాయకులు ఎన్నోసార్లు రైల్వే ప్రాజెక్టులపై చర్చించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన ముందడుగు పడలేదు. దీంతో "చౌటుప్పల్‌కు ఎప్పుడు రైలు వస్తుంది?" అనే ప్రశ్న ప్రజలలో తరచూ వినిపిస్తోంది.
"పెద్ది" సినిమాలో హీరో రెండున్నర గంటల్లో గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చినట్లుగా, నిజ జీవితంలో కూడా చౌటుప్పల్ ప్రజల కలను సాకారం చేసే నాయకత్వం ఎప్పుడు ముందుకు వస్తుందో చూడాలి. రైల్వే మార్గం, రైల్వే స్టేషన్ రూపంలో చౌటుప్పల్ ప్రజల ఎన్నో ఏళ్ల కల ఎప్పుడు నిజమవుతుందో కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు... చౌటుప్పల్ ప్రజలు రైలు రాక కోసం... కూత కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి.






