- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాపై చైనా చీమల దండయాత్ర
అమెరికాలో ప్రస్తుతం చైనా చీమలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో ప్రస్తుతం చైనా చీమలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏషియన్ నీడిల్ ఆంట్స్(Asian Needle Ants) గా పిలిచే ఈ చీమల దండయాత్ర అమెరికా పౌరులను బెంబేలెత్తి పోతున్నారు. ఇవి ప్రాథమికంగా చైనా, జపాన్, కొరియా వంటి తూర్పు ఆసియా ప్రాంతాలకు చెందినవి. అమెరికాలో వీటి ఉనికిని మొట్టమొదటిసారిగా 1932లో జార్జియా రాష్ట్రంలో గుర్తించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో షిప్పింగ్ కంటైనర్ల ద్వారా ఇవి అనుకోకుండా అమెరికా గడ్డపై అడుగుపెట్టి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సుమారు వందేళ్ల క్రితం ఒకే ప్రాంతానికి పరిమితమైన ఈ చీమలు, ప్రస్తుతం అమెరికాలో కనీసం 20 నుండి 22 రాష్ట్రాలకు విస్తరించాయి. ముఖ్యంగా నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, టెక్సాస్ వంటి వెచ్చని రాష్ట్రాలతో పాటు న్యూయార్క్, వాషింగ్టన్, విస్కాన్సిన్ వంటి చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి.
ప్రాణాలు తీస్తున్నాయి
ఈ చీమలు మానవులకు అత్యంత ప్రమాదకరంగా మారడానికి ప్రధాన కారణం వాటిలో ఉండే విషం. ఇవి కుట్టినప్పుడు కలిగే నొప్పిని బాధితులు "లిక్విడ్ ఫైర్"తో పోలుస్తారు. కుట్టిన చోట తీవ్రమైన మంట, వాపు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ చీమల కంటే ఇవి మనుషులను కుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ చీమల విషం వల్ల కొంతమందిలో అనాఫిలాక్సిస్(Anaphylaxis) అనే తీవ్రమైన అలర్జీ రియాక్షన్ సంభవించవచ్చు. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తూ, తక్షణ వైద్యం అందకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. తాజా నివేదికల ప్రకారం.. 2024-25 మధ్య కాలంలో జార్జియా రాష్ట్రంలోనే ఈ చీమల వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సుమారు 5 మిల్లీమీటర్ల పొడవు ఉండి, మెరుస్తూ నలుపు-గోధుమ రంగులో ఉండే ఈ చీమలు ఇతర జాతుల్లా పెద్ద పెద్ద చీమల పుట్టలు(Mounds) నిర్మించవు. రాలిన ఆకులు, కుళ్ళిన చెట్లు, రాళ్లు, గార్డెన్లలో వాడే మల్చ్ కింద నిశ్శబ్దంగా దాక్కుంటాయి.
వృక్షసంపదకు ముప్పు
మనుషుల ప్రాణాలకే కాకుండా పర్యావరణ పరంగా కూడా ఇవి భారీ నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఇవి స్థానిక కీటకాలను నాశనం చేయడమే కాకుండా, అడవుల్లో విత్తనాల వ్యాప్తికి దోహదపడే స్థానిక చీమల జాతులను తరిమికొడుతున్నాయి. దీనివల్ల వృక్షసంపద పునరుత్పత్తి దెబ్బతింటోంది. ఇవి ఒక చోటి నుండి మరో చోటికి వెళ్లడానికి మానవులనే వాహకాలుగా వాడుకుంటున్నాయి. నర్సరీ మొక్కలు, కట్టెలు, తోట పనిలో వాడే వస్తువుల ద్వారా ఇవి "హైచింగ్" చేస్తూ కొత్త ప్రాంతాలకు చేరుతున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వేగంగా విస్తరిస్తునట్టు సమాచారం. అడవులు, గార్డెన్లలో పని చేసేటప్పుడు తప్పనిసరిగా గ్లౌజులు, బూట్లు ధరించాలని, ఇంటి చుట్టూ ఉండే కుళ్ళిన ఆకులు, చెత్తను వెంటనే తొలగించాలని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడాన్ని బట్టి వీటి వల్ల కలుగుతున్న తీవ్ర పరిణామాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ చీమలు కుట్టినప్పుడు అధిక వాపు గాని శ్వాస ఇబ్బంది గాని తలెత్తితే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.






