ఆధిపత్య పోరు పై సీరియస్.. ఉప సర్పంచులకు 'చెక్ పవర్' కట్?

by Malleboina Mahesh |

గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచుల ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయాలని పంచాయతీరాజ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

ఆధిపత్య పోరు పై సీరియస్.. ఉప సర్పంచులకు చెక్ పవర్ కట్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామపంచాయతీల్లో ఉప సర్పంచులకు చెక్ పవర్‌ను రద్దు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు పెట్టినట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో కార్యదర్శికి బదులు చెక్ పవర్‌ను ఉప సర్పంచ్ కు కట్టబెట్టారు. అప్పట్లోనే దీనిపై అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తమైన.. అప్పటి సర్కారు పట్టించుకోలేదు. దీంతో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య రాజకీయ, వ్యక్తిగత వైరం, ఆధిపత్య పోరు వల్ల నిధులు అందుబాటులో ఉన్నా.. ఖర్చులో జాప్యం జరుగుతున్నదని ఆఫీసర్లు చెబుతున్నారు. పరిపాలనా పరమైన ఇబ్బందులు సైతం ఎదరువుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు ప్రతిపాదన సహేతుకమే అయినా.. బీఆర్ఎస్ దీన్ని రాజకీయంగా వాడుకుంటుందనే అనుమానంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

సంతకాల్లో జాప్యంతో తలనొప్పులు

నిధుల వినియోగంలో గతంలో సర్పంచ్, కార్యదర్శికి చెక్ పవర్ ఉండేది. బీఆర్ఎస్ హయాంలో దీన్ని ఉప సర్పంచులకు బదిలీ చేయడం సమస్యలకు దారితీసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు ఉప సర్పంచులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం అధికారులు, సర్పంచులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. ‘ఈ చెక్కుపై సంతకం పెడితే మాకేంటి? మేము అధికార పార్టీ కోసం పనిచేయడం లేదా? ఏం రానప్పుడు ఎందుకు సంతకం చేయాలి? ఆ పని ఎప్పుడు చేశారు? నాకు తెలియదు. నేను సంతకం చేయను’ ఇలా ఉప సర్పంచులు సంతకాల కోసం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో పనులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూటీ) సమర్పించడం అధికారులకు ఇబ్బంది అవుతుంది. యూసీలు సమర్పిస్తేనే ప్రభుత్వాలు మలి విడత నిధులను విడుదల చేస్తాయి. సంతకాల జాప్యంతో మళ్లీ నిధులు రావడంలో ఆలస్యమవుతోంది.

గతంలో గౌరవ వేతనాలపైనా తిరకాసు

బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్‌ల గౌరవ వేతనాలకు సంబంధించిన చెక్కుపై కూడా ఉప సర్పంచ్ సంతకం చేయాల్సి వచ్చేది. కొన్ని చోట్ల రాజకీయ, వ్యక్తిగత వైరుధ్యాలతో చెక్కులపై సంతకాలు చేయడానికి ఉప సర్పంచులు తిరకాసు పెట్టారు. దీంతో అనేక మంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పటి మంత్రులు, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం సర్పంచ్‌ల గౌరవ వేతనాలను నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో జమ చేసే విధంగా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నది. జీపీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతన చెక్కులపై సంతకాలు చేయడానికి కూడా ‘మాకేం లేదా’ అనే రీతిలో ఉప సర్పంచులు వ్యవహరిస్తున్నారని, దీంతో నిధులున్నా వేతనాలు ఆలస్యమవుతున్నాయని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ తీసేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

కార్యదర్శులను జవాబుదారీ చేస్తే..

సమస్యలన్నింటికీ పరిష్కారం ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దే అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలా చేస్తే నిధుల ఖర్చు కూడా వేగవంతమవుతుందని పేర్కొంటున్నారు. పంచాయతీకి ఒక కార్యదర్శి ఉన్నందున వారిని జవాబుదారి చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నట్లు తెలిసింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉప సర్పంచులకు చెక్ పవర్ లేదు. ప్రజాప్రతినిధి, అధికారికి కలిపి చెక్ పవర్ ఇస్తారు. కానీ రాష్ట్రంలో ఇద్దరు ప్రజాప్రతినిధులకే చెక్ పవర్ ఉండడంతో నిధులు దుర్వినియోగమైన సందర్భంలో తమకేమీ సంబంధం లేదని కార్యదర్శులు తప్పించుకుంటున్నారు.

అదే నిధుల వినియోగంలో ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత ఉంటే.. తప్పు జరిగినప్పుడు వారిపై చర్యలు తీసుకునే అవకాశముంటుంది. ఆయనకు సంబంధించిన సర్వీస్ బుక్, ఇతర రకాల అంశాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి వాటిని నిలిపివేయవచ్చు. వీటన్నింటి నేపథ్యంలో ఉప సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది ఉత్కంఠగా మారింది.

Next Story