కోర్టుకు చేరిన చాహల్ వివాదం.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ నటిపై సీరియస్

by Malleboina Mahesh |

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నటి తాన్యా ఛటర్జీపై పరువు నష్టం దావా వేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను బహిరంగపరిచి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టుకు చేరిన చాహల్ వివాదం.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ నటిపై సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చాహల్, నటి తాన్యా ఛటర్జీ (Tanya Chatterjee) మధ్య సోషల్ మీడియా వేదికగా మొదలైన వివాదం ఇప్పుడు న్యాయ స్థానానికి చేరింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో తాన్యా మాట్లాడుతూ.. చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోకు 'క్యూట్' అని మెసేజ్ చేశారంటూ స్క్రీన్ షాట్‌లను బహిరంగంగా ప్రదర్శించారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ వ్యక్తిత్వంపై రకరకాల చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలో, తన పరువుకు భంగం కలిగించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చాహల్, ఆమెపై పరువు నష్టం దావా (Defamation Case) దాఖలు చేశారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2026 లో బిజీగా ఉన్నప్పటికీ, తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఆయన ఈ చట్టపరమైన చర్యలు చేపట్టారు.

చాహల్ తీసుకున్న ఈ నిర్ణయంపై నటి తాన్యా ఛటర్జీ విస్మయం వ్యక్తం చేశారు. తనపై కేసు వేయడం హాస్యాస్పదంగా ఉందని, అసలు ఇది ఇంత వైరల్ అవుతుందని తాను అనుకోలేదని ఆమె పేర్కొన్నారు. తానేమీ అబద్ధం చెప్పలేదని, నిజం మాట్లాడినందుకు తననే అందరూ ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "మెసేజ్ పంపింది ఆయనే, కానీ బాధితురాలినైన నాపైనే పరువు నష్టం దావా వేయడం విచారకరం" అని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవైపు చాహల్ తన లీగల్ టీమ్ ద్వారా విచారణను వేగవంతం చేస్తుండగా, మరోవైపు ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story