- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాగాపురం ఘర్షణ ఘటన
ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా ఇటిక్యాల మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు.

దిశ, ఇటిక్యాల : ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా ఇటిక్యాల మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన ఇరువర్గాలకు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన మొత్తం 78 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఇటిక్యాల ఎస్ఐ రవి నాయక్ వెల్లడించారు. ఏరువాక పౌర్ణమి నాడు గ్రామంలో ఆచారబద్ధంగా నిర్వహించే కార్యక్రమంలో అకస్మాత్తుగా వివాదం తలెత్తి దళితులు, ఇతర వర్గాల మధ్య భౌతిక దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఇరువర్గాల వారు ఇచ్చిన రెండు ఫిర్యాదులను పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతలను తిరిగి అదుపులోకి తెచ్చేందుకు కఠిన చర్యలు చేపట్టిన పోలీసులు ఘర్షణలో పాల్గొన్న, ఉద్రిక్తతలకు కారణమైన బీసీ వర్గానికి చెందిన 39 మందిపై అలాగే ఎస్సీ వర్గానికి చెందిన మరో 39 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవి నాయక్ ఇరువర్గాల పెద్దలు, యువకులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు గ్రామంలో ఇకమీదట ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, సహనంతో మెదలాలని సూచించారు. ఎవరైనా మళ్లీ గొడవలకు దిగినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా, గ్రామంలోని ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూసినా చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పండుగలు, ఆచారాల పేరుతో పగలు, ప్రతీకారాలు పెంచుకోవడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.






