‘మోస్ట్ వాంటెడ్’ను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్‌కు కేంద్రం అవార్డు

by Gantepaka Srikanth |

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని పట్టుకునే క్రమంలో తూటా గాయమైనా వెనకడుగు వేయకుండా ప్రాణాలకు తెగించి పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకటరెడ్డికి కేంద్ర ప్రభుత్వం ‘మెడల్ ఫర్ గ్యాలంటరీ’ పురస్కారం ప్రకటించింది.

‘మోస్ట్ వాంటెడ్’ను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్‌కు కేంద్రం అవార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని పట్టుకునే క్రమంలో తూటా గాయమైనా వెనకడుగు వేయకుండా ప్రాణాలకు తెగించి పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకటరెడ్డికి కేంద్ర ప్రభుత్వం ‘మెడల్ ఫర్ గ్యాలంటరీ’ పురస్కారం ప్రకటించింది. గౌలిదొడ్డిలోని ప్రిజం పబ్‌కు ప్రభాకర్ వస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి సమాచారం అందింది. వెంటనే ఆయన సహచరులు ప్రదీప్ రెడ్డి, వీరాస్వామిలతో కలిసి పబ్ వద్దకు చేరుకుని నిందితుడిని లొంగిపోవాలని ఆదేశించారు. పోలీసులను చూసిన ప్రభాకర్ తన వద్ద ఉన్న తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక తూటా వెంకటరెడ్డి ఎడమ కాలి బొటనవేలికి తగిలి గాయమైంది. అయినప్పటికీ గాయాన్ని పట్టించుకోకుండా ఆయన సహచరులతో కలిసి నిందితుడిపై దూకి కట్టడి చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో నిందితుడిపై హత్యాయత్నం, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత 20 ఏళ్లుగా పోలీస్ శాఖలో సేవలందిస్తున్న మర్రి వెంకటరెడ్డి ధైర్యసాహసాలకు గుర్తింపుగా 2026 రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డు ప్రకటించింది.

Next Story