కేంద్రం నిర్ణయంతో నగరాలకు బూస్ట్

by Malleboina Mahesh |

నగరాల అభివృద్ధికి కేంద్రం బూస్ట్! అర్బన్ చాలెంజింగ్ ఫండ్ మార్గదర్శకాలు విడుదల. ఆదాయం పెంచుకునే పట్టణ సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు.

కేంద్రం నిర్ణయంతో నగరాలకు బూస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని 10 లక్షలకు పైగా జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరాలు, పారిశ్రామిక కేంద్రాలైన నగరాలతో పాటు మిలియన్ ప్లస్ సిటీలకు సైతం అర్బన్ చాలెంజింగ్ ఫండ్ (యూసీఎఫ్) ద్వారా నిధులివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా రీ డెవలప్‌మెంట్ ఆఫ్ సిటీస్, గ్రోత్ కారిడార్లు, గ్రోత్ హబ్స్, వాటర్, శానిటేషన్, మురుగునీటి ప్రాజెక్టులకు మాత్రమే అర్బన్ చాలెంజింగ్ ఫండ్ నుంచి నిధులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

నిధులివ్వాలంటే..

అర్బన్ చాలెంజింగ్ ఫండ్ నుంచి నిధులు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా వివరాలు పంపించాలని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖలను సైతం పంపించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు స్టేటస్, ప్రాజెక్టు ఫీచర్స్, ఫిజికల్, ఫైనాన్సియల్ ప్రోగ్రెస్, ప్రాజెక్టు వ్యయం, ప్రాజెక్టు కాన్సెప్ట్ ప్లాన్, డీపీఆర్, టెండర్ డాక్యుమెంట్, వర్క్ ఆర్డర్, ప్రాజెక్టు ప్రారంభించిన తేది, పూర్తి చేయనున్న అంచనా తేదీలను పంపించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు పట్టణ స్థానిక సంస్థల్లో ఆదాయం పెంచుకునే మార్గాల పై దృష్టి సారించాలని సూచించింది. ఆస్తి పన్ను ద్వారా ఆదాయం పెంచుకోవడం, యూజర్ చార్జీలు, అడ్వర్‌టైజ్‌మెంట్ చార్జీలు, సేల్ ఆఫ్ రీయూజ్ వాటర్/ఎనర్జీ వంటి వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటే ప్రోత్సాహకంగా నిధులు ఇవ్వనుంది.

సీఎస్ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌పీఎస్సీ..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక రాష్ట్ర ఉన్నత స్థాయి నిర్దేశక కమిటీ (ఎస్‌హెచ్‌పీఎస్సీ) ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ మిషన్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా నిర్దేశిస్తుంది. సంబంధిత ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలంటే ఈ కమిటీ ఆమోదించాల్సిందే. కమిటీలో సీఎస్ చైర్మన్‌గా, సభ్య కార్యదర్శిగా పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి (గృహ నిర్మాణ, పట్టణ ప్రణాళిక శాఖ), ముఖ్య కార్యదర్శి (పరిశ్రమలు/ఆర్థికాభివృద్ధి శాఖ), ముఖ్య కార్యదర్శి (గ్రామీణాభివృద్ధి శాఖ), మిషన్ డైరెక్టర్, డీటీసీసీ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ఉంటారు.

ఐదేళ్ల నిర్వహణ పరిశీలన తర్వాతే..

రాష్ట్ర స్థాయిలో టెక్నికల్ కమిటీకి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆ ర్, టెండర్ పత్రాల సాంకేతిక మూల్యాంకనానికి బాధ్యత వహిస్తుంది. ఆమోదం ఇచ్చేముందు, ప్రాజెక్టుల కోసం వివాద రహిత భూమి లభ్యతను, కనీసం ఐదు సంవత్సరాల పాటు నిర్వహణను పరిశీలించిన తర్వాతనే నిధుల విడుదలకు అంగీకరిస్తుంది.

నిధుల విడుదల ఇలా..

అర్బన్ చాలెంజింగ్ ఫండ్ ద్వారా ప్రాజెక్టులకు మూడు విడతలుగా నిధులు ఇవ్వనున్నారు. మొదటి విడతగా కేంద్ర సాయంలో 30 శాతానికి సమానంగా (ఆమోదిత ప్రాజెక్టు వ్యయం లేదా టెండర్ ప్రాజెక్టు వ్యయం రెండింటిలో ఏది తక్కువైతే దాని ఆధారంగా) నేషనల్ అపెక్స్ కౌన్సిల్ (ఎన్ఏసీ), కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ, స్టేట్ హైపవర్ స్టీరింగ్ కమిటీ ఆమోదించిన ప్రాజెక్టులకు మాత్రమే నిధులు ఇవ్వనున్నారు. దీంతోపాటు రెండో విడతగా కేంద్ర సాయంలో 50 శాతానికి సమానమైన (ఆమోదించిన ప్రాజెక్ట్ వ్యయం లేదా టెండర్ చేసిన ప్రాజెక్ట్ వ్యయం, ఏది తక్కువైతే దాని ఆధారంగా) వాటా కింద నిధులు ఇవ్వనున్నారు.

అయితే, దీనికి జియో ట్యాగ్ చేసిన ఆధారాలతో పాటు 40 శాతం పనులు పూర్తి చేసి 75 శాతం యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పిస్తే తప్ప ఫైనాన్సింగ్ సంస్థల నుంచి లోన్ ఇవ్వరాదని నిబంధనలు రూపొందించారు. ఇక మూడో విడతగా 20 శాతం నిధులను 75 శాతం ప్రాజెక్టు పనులు పూర్తికావడంతో పాటు 75 శాతం యూసీలను అందజేసిన తర్వాతనే విడుదల చేయనున్నారు.

Next Story