కేంద్రం బిగ్ ట్విస్ట్.. వారందరికీ గ్యాస్ సబ్సిడీ కట్

by Muthe.Rajitha |

రూ.10 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ కట్ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్రం బిగ్ ట్విస్ట్.. వారందరికీ గ్యాస్ సబ్సిడీ కట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అధిక ఆదాయం కలిగిన కుటుంబాలకు సబ్సిడీ నిలిపివేసేందుకు మరోసారి కఠిన చర్యలకు దిగింది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన వారికి ఎల్పీజీ (LPG) సబ్సిడీని రద్దు చేసేందుకు కీలక చర్యలకు దిగింది. అయితే ఈ నిబంధన 2015 డిసెంబర్ నుంచే అమలులో ఉన్నప్పటికీ, గతంలో వినియోగదారులు స్వచ్చందంగా సబ్సిడీ వదులుకునేవారు. కానీ ఇప్పుడు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పాన్ కార్డ్ డేటా ఆధారంగా ఎవరి ఆదాయం నిర్ణీత పరిమితికి మించి ఉందో గుర్తించి, వారి సబ్సిడీని తొలగించేందుకు జాబితాలను సిద్ధం చేస్తున్నాయి.

ఈ కొత్త విధానం ప్రకారం, కేవలం గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి ఆదాయం మాత్రమే కాకుండా, వారి జీవిత భాగస్వామి ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వీరిద్దరిలో ఎవరి ఆదాయం రూ. 10 లక్షలు దాటినా ఆ కుటుంబం సబ్సిడీకి అనర్హులుగా ప్రకటించబడుతుంది. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులకు వారి మొబైల్ నంబర్లకు హెచ్చరిక సందేశాలు (SMS) అందుతున్నాయి. అందులో ఐటీ రికార్డుల ప్రకారం మీ ఆదాయం పరిమితి దాటిందని, దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా స్పందించాలని, లేనిపక్షంలో సబ్సిడీ నిలిపివేస్తామని స్పష్టంగా పేర్కొంటున్నారు. ఈ చర్య వల్ల ప్రభుత్వ ఖజానాపై సబ్సిడీ భారం తగ్గుతుందని, ఆ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించవచ్చని కేంద్రం భావిస్తోంది.

అయితే, ఈ కఠిన నిబంధనల నుంచి సామాన్యులకు, పేదలకు ప్రభుత్వం పూర్తి మినహాయింపునిచ్చింది. ముఖ్యంగా 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' కింద కనెక్షన్లు పొందిన కోట్లాది మంది లబ్ధిదారులకు ఈ కొత్త రూల్ వర్తించదు. వారికి లభించే ప్రత్యేక సబ్సిడీ యధావిధిగా కొనసాగుతుంది. ఒకవేళ మీ ఆదాయం రూ. 10 లక్షల కంటే తక్కువ ఉండి కూడా మీకు ఇలాంటి మెసేజ్ వచ్చినట్లయితే, వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి లేదా గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

Next Story