- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీతం కోసం లంచం.. వనపర్తి పోస్టల్ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ!
వనపర్తిలో జీతం డబ్బుల కోసం లంచం డిమాండ్ చేసిన పోస్టల్ ఇన్‌స్పెక్టర్‌ను సీబీఐ అధికారులు పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించగా, దర్యాప్తు కొనసాగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జీతం డబ్బులు విడుదల చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని పేచీ పెట్టిన వనపర్తి డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బాధితుడి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పక్కా పథకం ప్రకారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడికి చెందిన రెండు నివాసాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
సీబీఐ కథనం ప్రకారం.. వనపర్తి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్‌లు కలిసి బాధితుడిని గత కొంతకాలంగా వేధిస్తున్నారు. సబ్‌స్టిట్యూట్ జీతం విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ, దానికోసం రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు సీబీఐ అధికారులను ఆశ్రయించడంతో ఈ నెల 7వ తేదీన సదరు అధికారులపై కేసు నమోదైంది. ఈ విచారణలో భాగంగా అంతకుముందే నిందితులు బాధితుడి నుంచి సుమారు రూ.1.30 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఇన్‌స్పెక్టర్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నివాసాల్లో సోదాలు..
అరెస్టు అనంతరం నిందితుడికి చెందిన రంగారెడ్డి జిల్లా లోని నివాసం తో పాటు ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న మరో ఇంటిలో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో కేసు దర్యాప్తునకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలు, బ్యాంకులు, రైల్వేలు, బీమా సంస్థల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సీబీఐ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సూచించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని సీబీఐ అధికారులు వెల్లడించారు.






