గుప్పెడు గుండెకు... సింగరేణి గట్టి భరోసా !

by Batti.Sumithra |

దేశానికి వెలుగులు పంచే కార్మికుల ఆరోగ్య పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

గుప్పెడు గుండెకు... సింగరేణి గట్టి భరోసా !
X

దిశ, కొత్తగూడెం (సింగరేణి): దేశానికి వెలుగులు పంచే కార్మికుల ఆరోగ్య పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు గుండెకాయగా ఉన్న కార్మికుల హృదయాలకు గట్టి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను రామగుండం–1 ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది. త్వరలోనే దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సింగరేణి కార్మికులకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులు అధిక సంఖ్యలో (దాదాపు 33 వేల మంది) నివసించే గోదావరిఖని ప్రాంతంలో సంస్థ తొలి క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం విశేషం. దీంతో పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్–ఆసిఫాబాద్, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నివసిస్తున్న వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత సింగరేణి ఉద్యోగులతో పాటు సమీప గ్రామాల ప్రజల హృదయాలకు సింగరేణి గట్టి భరోసా కల్పించినట్లైంది.

గుండె సంబంధిత సమస్యలు నేడు వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. ఇది ఎప్పుడు వస్తుందో అంచనా వేయడం కష్టమే అయినప్పటికీ, గుండెపోటు వచ్చిన తొలి గంట అత్యంత కీలకమని వైద్యులు పేర్కొంటారు. దీనినే ‘గోల్డెన్ అవర్’గా వ్యవహరిస్తారు. ఈ సమయంలో సత్వర చికిత్స అందించగలిగితే విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కంపెనీ ఆధ్వర్యంలో అనేక ఆధునిక వైద్య సౌకర్యాలతో కూడిన ఏరియా ఆసుపత్రులు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు కార్డియాక్ సంబంధిత సేవలు పరిమితంగానే అందుబాటులో ఉండేవి. గుండెపోటు వచ్చిన రోగులను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి సుదూర నగరాలకు తరలించాల్సి వచ్చేది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో అమూల్యమైన ‘గోల్డెన్ అవర్’ వృథా అవుతుండేది. ఈ నేపథ్యంలోనే గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను సింగరేణి ఏర్పాటు చేసింది.

ప్రాణాలను కాపాడే ‘గోల్డెన్ అవర్’ వైద్యం..

గుండెపోటు వచ్చిన తొలి గంట అత్యంత కీలకమైనది. అదే సమయంలో యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందితే రోగి ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ అత్యవసర సేవల ప్రాధాన్యతను గుర్తించిన సింగరేణి యాజమాన్యం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో ఈ క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. బొగ్గు బెల్ట్ ప్రజలకు సకాలంలో, తక్కువ వ్యవధిలోనే అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్యాథ్ ల్యాబ్‌లో 5 పడకల సామర్థ్యంతో ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ (ICCU), 10 పడకల సామర్థ్యంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU), ప్రత్యేక గదులతో కూడిన ఔట్ పేషెంట్ (OP) బ్లాక్ ఏర్పాటు చేశారు. గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, భూపాలపల్లి, మంథని తదితర పరిసర ప్రాంతాలతో పాటు మొత్తం కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రజలకు ఈ క్యాథ్ ల్యాబ్ ఎంతో ఉపయోగపడనుంది.

Next Story