- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ పార్టీ టికెట్ నిరాకరించినా.. పట్టం కట్టిన జగిత్యాల ఓటర్లు
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కని బాధతో కన్నీరు పెట్టుకున్న నేతలకు జగిత్యాల ఓటర్లు అండగా నిలిచారు. 22, 26 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన ఆరవ లక్ష్మి, పులి రమలు పార్టీ అభ్యర్థులను మట్టికరిపించి విజేతలుగా నిలిచారు.

దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల మున్సిపాలిటీ (Jagtial Municipality)లో టికెట్ ఆశించిన నామినేషన్ వేసిన బీజేపీ నేతలకు బీ ఫామ్ దక్కకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన ఆ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు బీజేపీ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్టీ బీ ఫామ్ ఇవ్వకపోయినప్పటికి, రాజకీయం అంటే కేవలం బి-ఫామ్ మాత్రమే కాదు. ప్రజల గుండెల్లో సంపాదించుకున్న నమ్మకమని జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. సొంత పార్టీ గుర్తు లేకపోయినా, స్వతంత్రులుగా బరిలోకి దిగి అధికారిక అభ్యర్థులను మట్టికరిపించిన ఇద్దరు మహిళా నేతల విజయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిగిత్యాలలోని 22వ వార్డులో ఆరవ లక్ష్మి (బిట్టు), 26వ వార్డులో సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమ (శ్రీధర్) ఘనవిజయం సాధించి, తమపై ఉన్న ప్రజాభిమానాన్ని చాటుకున్నారు.
కాగా ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వారి విజయాల వెనుక ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. టికెట్ వస్తుందని ఆశించిన ఈ ఇద్దరు నేతలకు చివరి నిమిషంలో బీజేపీ హ్యాండిచ్చింది. తమ తల్లులకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక వారి కుమారులు మీడియా ముందే కన్నీరు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ కన్నీటి దృశ్యాలు చూసిన వార్డు ప్రజలు చలించిపోయారు. పార్టీ గుర్తింపు లేకపోయినా, మా అభ్యర్థులను మేమే గెలిపించుకుంటామనే పట్టుదలతో ఓటర్లు స్వచ్ఛందంగా కదిలి రావడమే ఈ అనూహ్య విజయానికి ప్రధాన కారణం.
నిజానికి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికంటే, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన వీరిద్దరూ భారీ మెజార్టీ సాధించడం విశేషం. కేవలం డబ్బు, పార్టీ ప్రాబల్యం మాత్రమే ఉంటే సరిపోదు, కష్టకాలంలో తోడు నిలిచే నాయకులు కావాలని ప్రజలు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. బి-ఫామ్‌ను నమ్ముకున్న నేతలకు, ప్రజలనే నమ్ముకున్న నేతలకు మధ్య జరిగిన ఈ పోరులో అంతిమంగా ప్రజాక్షేత్రమే గెలిచిందని స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే వారి విజయంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తూ.. పార్టీకి అంకితభావంతో పనిచేసే వారిని గుర్తించకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని, ఇప్పటికైన బీజేపీ పార్టీ తీరు మార్చుకొవాలని కామెంట్లు చేస్తున్నారు.






