- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తి హత్య కేసులో కాల్ రికార్డింగ్ కలకలం
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్‌లో గల్ఫ్ నుంచి వచ్చిన భర్త ప్రశాంత్ (35) హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.

దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్‌లో గల్ఫ్ నుంచి వచ్చిన భర్త ప్రశాంత్ (35) హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే మృతుడి భార్య సంధ్య, ఆమెతో సన్నిహితంగా ఉన్న అనిల్, కంది వెంకటసాయి అలియాస్ బంటిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఓ కాల్ రికార్డింగ్ (ఆడియో కాల్) బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు వివరాల ప్రకారం సంధ్యకు అనిల్‌తో వివాహేతర సంబంధం ఉండగా, భర్త ప్రశాంత్ అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతడిని హత్య చేసేందుకు భార్య, ఆమె ప్రియుడితో కలిసి ముందుగానే కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కుట్రలో బంటి కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాల్ రికార్డింగ్‌లో "వాడికి నిండుగా తాగించు.. డాబా మీద నుంచి వాడు కిందికి దిగొద్దు.. ఇంకా కావాలంటే కావాల్సినంత మద్యం తెప్పించు.. నీదే బాధ్యత..." అంటూ సంధ్య ఫోన్‌లో బంటికి సూచనలు చేసినట్లు ఆడియో కాల్ ద్వారా స్పష్టమవుతోంది.
ఆమె మాటలు ఆడియో కాల్ లో స్పష్టంగా వినిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో ద్వారా ప్రశాంత్ హత్యకు ముందే ప్రణాళిక సిద్ధమైనట్లు సూచిస్తోందని స్థానికంగా చర్చసాగుతోంది. అయితే, ఈ వైరల్ ఆడియో ప్రామాణికత పై పోలీసులు అధికారికంగా ఇంకా ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన చేయలేదు. దర్యాప్తు ప్రకారం, జూన్ 29న బంటి ప్రశాంత్‌కు అధికంగా మద్యం తాగించి మత్తులో ఉన్న అతడిని ఇంటి డాబా పై నుంచి కిందకు తోసేసినట్లు విచారణలో వెల్లడైంది. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, చేతికి ఉన్న కాన్యులా ద్వారా టాయిలెట్ క్లీనర్ (హార్పిక్)తో పాటు మత్తు మాత్రల మిశ్రమాన్ని ఎక్కించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన సంధ్య, అనిల్, బంటి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు సమాచారం. ఫోన్ డేటాలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
హత్యకు ముందు, తర్వాత ఎవరెవరితో మాట్లాడారు ? ఏం మాట్లాడారనే విషయాలతో పాటు, హత్యకు సంబంధించి ముందస్తు సమాచారం ఎవరికి ఇచ్చారు ? నేరాన్ని ఎలా దాచిపెట్టాలని ప్రయత్నించారు ? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఈ హత్య వెనుక మరికొందరి పాత్ర కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని వారు చెబుతున్నారు. అలాగే, ప్రధాన నిందితులు తమ మొబైల్ ఫోన్లలోని కొన్ని డేటాను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీని పై కూడా ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, భార్య సంధ్యకు మరికొంతమందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని, కోట్ల రూపాయల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకే ప్రశాంత్‌ను లక్ష్యంగా చేసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలు ఇంకా పోలీసు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. కేసుకు సంబంధించిన పూర్తి నిజాలు దర్యాప్తు పూర్తయ్యాకే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






