గల్ఫ్ సంక్షోభంపై కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ భేటీ.. భారతీయుల తరలింపు పై కసరత్తు!

by Malleboina Mahesh |   (  Updated:2026-03-02 03:49:21  IST  )

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై పీఎం మోదీ అధ్యక్షతన CCS అత్యవసర భేటీ. గల్ఫ్ లోని కోటి మంది భారతీయుల భద్రతే లక్ష్యం. తక్షణమే యుద్ధం ఆపాలని పిలుపు.

గల్ఫ్ సంక్షోభంపై కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ భేటీ.. భారతీయుల తరలింపు పై కసరత్తు!
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో యుద్దం కొనసాగుతోంది. తమపై దాడికి ప్రతి దాడిగా ఇరాన్ ఎనిమిదికి పైగా దేశాలపై ప్రత్యక్షంగా దాడికి దిగింది. దీంతో ఆయా దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో పశ్చిమ ఆసియాలో మారుతున్న యుద్ధ పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ‘కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’ (CCS) నిన్న సాయంత్రం అత్యవసరంగా భేటీ అయ్యింది. ముఖ్యంగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన వైమానిక దాడులు, ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఈ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత అంతర్జాతీయ భద్రతతో పాటు ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

భారతీయుల భద్రత- ఇబ్బందులు

ఈ ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది భారతీయ ప్రవాసుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విమాన ప్రయాణాలు నిలిచిపోవడంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులు, అలాగే ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను CCS సమీక్షించింది. యుద్ధ వాతావరణం వల్ల భారతీయ పౌరులకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాలు - శాంతి కోసం పిలుపు..

బాధిత భారతీయులందరికీ అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించాలని సంబంధిత శాఖలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణమే దాడులను నిలిపివేసి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. శాంతి పునరుద్ధరణ ద్వారానే ప్రాంతీయ. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఉద్ఘాటించింది.

యూఏఈపై ఇరాన్ దాడులు.. ఓ భారతీయునికి గాయాలు

Next Story