100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 కి చేరిన మృతుల సంఖ్య

by Malleboina Mahesh |

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ప్రయాణికుల బస్సు లోయలో పడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15 కి చేరినట్టు అధికారులు తెలిపారు. అలాగే మరో 13 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉధంపూర్ జిల్లాలోని రామనగర్ నుంచి ఉధంపూర్ పట్టణానికి వెళ్తున్న ప్రయాణికుల బస్సు, కాఘోట్ (Kagort) గ్రామం సమీపంలో ఒక ప్రమాదకరమైన మలుపు (Blind Curve) వద్ద అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదం ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. కొండ ప్రాంతాల్లో ఉండే ప్రమాదకరమైన మలుపును తిరుగుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. సుమారు 100 అడుగుల పైనుంచి పడటంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసులు, ఆర్మీ మరియు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి శిథిలాల నుంచి బాధితులను వెలికితీశారు. ప్రస్తుతం గాయపడిన వారిని ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ..తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన తన ట్వీట్‌లో "ఉధంపూర్‌లో జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదం పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. ఈ ఘటనలో అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, ఈ ప్రమాదం వల్ల ప్రభావితమైన వారందరికీ మనోధైర్యం కలగాలని ప్రార్ధిస్తున్నాను" అని రాజ్ నాథ్ సింగ్ రాసుకొచ్చారు.

Next Story