కోర్టు తీర్పు ముసుగులో పేద విద్యార్థులపై భారం?

by Malleboina Mahesh |

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన కోర్టు తీర్పును ఇప్పుడు అదే కాలేజీలు తమకు అనుకూలంగా మలచుకొని పేద విద్యార్థులపై మరింత భారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయన్న తీవ్ర ఆరోపణలు వైద్య సంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

కోర్టు తీర్పు ముసుగులో పేద విద్యార్థులపై భారం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన కోర్టు తీర్పును ఇప్పుడు అదే కాలేజీలు తమకు అనుకూలంగా మలచుకొని పేద విద్యార్థులపై మరింత భారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయన్న తీవ్ర ఆరోపణలు వైద్య సంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో సింగిల్ బెంచ్ ఓ కేసులో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల ఫీజులపై కీలకమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో కాలేజీల అసోసియేషన్ ఒకే కాలేజీ.. అన్ని కోటాలకు ఒకే ఫీజు.. అంటూ ప్రభుత్వంపై పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు.. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు చారిత్రక తీర్పులను ఆధారంగా తీసుకొని ఫీజులపై కీలక ఆదేశాలను ఇవ్వగా... దీన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని వైద్య వర్గాలు ఆరోపిస్తున్నాయి.

కోటా పేరుతో ఫీజుల తేడా చట్ట విరుద్ధం..

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ హైకోర్టు పేర్కొన్న మేరకు.. ఒకే కాలేజలో చదివే విద్యార్థుల మధ్య ‘కన్వీనర్ కోటా’, ‘మేనేజ్‌మెంట్ కోటా’ అంటూ వేర్వేరు ఫీజులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని. ఒక విద్యార్థి నుంచి ఎక్కువ వసూలు చేసి, మరో విద్యార్థికి తక్కువ ఫీజు వసూలు చేయడం అన్యాయం అని సుప్రీం కోర్టు తేల్చింది. ఈ విధానం వల్ల పేద విద్యార్థులే ఎక్కువ ఫీజు చెల్లించి, ధనిక కుటుంబాల విద్యార్థులు తక్కువ ఫీజుతో చదువుకునే పరిస్థితి ఏర్పడిందని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా ఈ కేసులో హైకోర్టు మరో కీలక విషయాన్ని గుర్తు చేసింది. ఫీజు నిర్ణయం అనేది కోటాల ఆధారంగా కాకుండా ఆ కాలేజీకి వచ్చే ఖర్చుల ఆధారంగా జరగాలని.. కాలేజీ నిర్వహణ, హాస్పిటల్ ఖర్చులు, అధ్యాపకుల జీతాలు, మౌలిక వసతులు, లోన్‌ల వడ్డీలు వంటి అంశాలను పరిశీలించి స్వతంత్ర కమిటీ అయిన ఏఎఫ్ఆర్సీ ఫీజును నిర్ణయించాలని.. ఆ ఫీజు మూడేళ్ల పాటు అమల్లో ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది.

ఒకే కాలేజీకి ఒకే ఫీజు ఉండాలి అనే కోర్టు తీర్పును కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకునే కుట్ర చేస్తున్నాయని హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ విమర్శించింది. కాలేజీల తీరు చూస్తుంటే మెరిట్, నాన్ మెరిట్ స్టూడెంట్స్ అందరినీ ఒకే గాటన కట్టేయాలనే ప్రయత్నం జరుగుతోందని హెచ్ఆర్డీఏ ఆరోపించింది. అందరి నుంచి మేనేజ్‌మెంట్ కోటా స్థాయి ఫీజు వసూలు చేయాలనే కుట్రో మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఓ ఫీజుల మాఫియాగా మారి ప్రభుత్వాన్ని, వ్యవస్థలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు కన్వీనర్ కోటాలో రూ. 7 లక్షలు చెల్లించిన ఓ మెడికల్ పీజీ విద్యార్థి నుంచి కూడా ఇకపై రూ. 25-30 లక్షలు వసూలు చేసేలా తీర్పును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయని వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఫీజు సమానత్వమా.. దోపిడీకి కొత్త మార్గమా?

ఒకే కాలేజీలో ఒకే ఫీజు అన్న సూత్రం వెనుక ఉన్న అసలు ఉద్దేశం పేద విద్యార్థులు భారీ ఫీజుల నుంచి తప్పించుకుని అందుబాటులో ఉండే ఫీజులతో వైద్య విద్యను పూర్తి చేసేలా వారిని కాపాడడం. కానీ దాన్ని “అందరికీ ఎక్కువ ఫీజు”గా మార్చితే వైద్య విద్య నిజంగానే పేదలకు అందని ద్రాక్షగా మారుతుందని వైద్య సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా ఏ ప్రైవేటు కాలేజీకి రాని ఇలాంటి ఆలోచనలన్నీ మన వద్ద ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలకు మాత్రమే వస్తుందని... దీనిపై ప్రభుత్వం వెంటనే అప్పీల్ చేయకుంటే రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఇది పెద్ద శరాఘాతంగా మారుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

మెడికల్ విద్యను పేదలకు మరింత అందని ద్రాక్షగా మార్చే కుట్ర తెలంగాణలో అధికారికంగానే మొదలైందా.. న్యాయస్థానం తీర్పును అమలు చేయాలంటూ ఫీజుల నియంత్రణ సంస్థ ప్రభుత్వానికి పంపిన లేఖ ఇప్పుడు ఈ అనుమానాలను బలపరుస్తోంది. ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫీజులు, డొనేషన్లు వసూలు చేసుకుంటుంటే ఏమాత్రం స్పందించని టీఏఎఫ్ఆర్సీ.. మెడికల్ కాలేజీల న్యాయస్థానం ఉత్తర్వులపై మాత్రం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. డిసెంబర్ 29న వైద్య శాఖ కార్యదర్శికి టీఏఎఫ్ఆర్సీ పంపిన లేఖలో, ఎంబీబీఎస్, పీజీ మెడికల్ కోర్సుల్లో ఒకే ఫీజు విధానం అమలు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరింది.

కన్వీనర్ కోటాకు మేనేజ్‌మెంట్ కోటాకు తేడా లేకుండా చేస్తారా..

కన్వీనర్ కోటా అంటే దాదాపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొంచెంలో అవకాశాలు కోల్పోయి ప్రభుత్వం నిర్ణయించిన నామ మాత్రపు ఫీజుతో ఎంబీబీస్ లేదా పీజీ మెడిసిన్ పూర్తి చేసేందుకు లభించిన అవకాశంగా ఇన్నాళ్లు వైద్య విద్యార్థులు భావించారని.. కానీ ఇకపై కన్వీనర్ కోటాను కూడా మేనేజ్‌మెంట్ సీట్ల గాటిన కట్టేసే కుట్ర జరుగుతోందని హెచ్ ఆర్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. కార్తీక్ నాగుల తెలిపారు. ఈ విధానం వస్తే తక్కువ ఫీజుతో వైద్య విద్యను పూర్తి చేసే నిరుపేద విద్యార్థుల అవకాశాలను నాశనం చేసేందుకు కన్వీనర్ కోటా లేకుండా చేయడమేనని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయాన్ని పక్కనపెట్టి లాభాల కోసం ఒత్తిడి తెచ్చే ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రయత్నాలకు ప్రభుత్వం లొంగిపోవద్దని కోరారు.:- హెచ్ఆర్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. కార్తీక్ నాగుల

కోర్టు ఏమన్నది- టీఏఎఫ్ఆర్సీ ఏమంటోంది..

ఒకే కాలేజీలో ఒకే కోర్సుకు ఒకే ఫీజు ఉండాలని.. అది కాలేజీ ఖర్చుల ఆధారంగా నిర్ణయించాలని.. హైకోర్టు సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. కానీ టీఏఎఫ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఏ, బీ కేటగిరీ సీట్లకు ఒకే ఫీజు అమలు చేయాలని మాత్రమే పేర్కొంది. “ఏ, బీ కి ఒకే ఫీజు” అంటే.. అందరికీ మేనేజ్‌మెంట్ కోటా స్థాయి ఫీజు పెట్టడమే వ్యూహంగా కనిపిస్తోందని వైద్యసంఘాలు ఆరోపిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోటా ఫీజును తగ్గించి కన్వీనర్ కోటాకు తీసుకురావాలని ప్రైవేటు వైద్య కళాశాలలు కోర్టులకు పోవని.. కన్వీనర్ కోటా ఫీజులను కూడా మేనేజ్‌మెంట్ కోటా స్థాయికి తీసుకుపోవాలనే కుట్రే ఇందులో కనిపిస్తోందని హెచ్ఆర్డీఏ వైస్ ప్రెసిడెంట్ డా. సురేష్ బాబు దిశకు తెలిపారు.

Next Story