పీఎం కిసాన్ సాయం పెంపుపై బడ్జెట్‌లో స్పష్టత.. ఆ వార్తలకు చెక్

by Malleboina Mahesh |

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే.. పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని భారీగా పెంచబోతుందని గత రెండు నెలలుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పీఎం కిసాన్ సాయం పెంపుపై బడ్జెట్‌లో స్పష్టత.. ఆ వార్తలకు చెక్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే.. పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని (PM Kisan Investment Assistance) భారీగా పెంచబోతుందని గత రెండు నెలలుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని కేంద్ర రూ. 6000 నుంచి రూ. 8,000 లేదా రూ. 10,000 కు పెంచుతారని, వార్షిక్ బడ్జెట్ లో దీనిపై ప్రకటన ఉండబోతుందని వార్తలు వచ్చాయి. దీంతో కేంద్ర బడ్జెట్ 2026పై రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.

కానీ చివరికి పీఎం కిసాన్ పెట్టుబడి సాయం పెంపుపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడి సాయం పెంచుతారనే అంచనాలు వెలువడినప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతమున్న రూ. 6,000 మొత్తాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకం కింద యథావిధిగా మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు రూ. 63,500 కోట్లను కేటాయించింది.

తెలంగాణలో లబ్ధిదారుల పరిస్థితి

తెలంగాణ రాష్ట్రంలో పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 31.19 లక్షల మంది రైతులు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. గతంలో ఈ సంఖ్య సుమారు 37 లక్షల వరకు ఉండగా, భూ రికార్డుల ప్రక్షాళన, ఈ-కేవైసీ (e-KYC) నిబంధనలు, ఆదాయపు పన్ను చెల్లింపుదారుల తొలగింపు వంటి కారణాల వల్ల లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. వచ్చే 22వ విడత సాయం బడ్జెట్ అనంతరం విడుదల కానుండగా, అర్హత కలిగిన రైతులు తమ ఆధార్ అనుసంధానం, ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story