సీఎం సోయితప్పి మాట్లాడుతున్నడు : రాగిడి లక్ష్మారెడ్డి

by Batti.Sumithra |

సహజ కవి, గేయ రచయిత అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండించారు.

సీఎం సోయితప్పి మాట్లాడుతున్నడు : రాగిడి లక్ష్మారెడ్డి
X

దిశ, ఘట్కేసర్ : సహజ కవి, గేయ రచయిత అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండించారు. ఆదివారం ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో బంధన్ ఫంక్షన్ హాల్లో ఘట్‌కేసర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కవి అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వేదికగా మార్చుకున్నారని అన్నారు. అందె శ్రీ సాహిత్య ప్రస్థానం, తెలంగాణ భాషా సంస్కృతికి ఆయన చేసిన సేవలు, కవుల పాత్ర గురించి, స్మృతి వనం పనులు ఎంత గడువులో పూర్తి చేస్తారనే విషయం పై మాట్లాడాల్సిన సీఎం సోయితప్పి మాజీ సీఎం, బీఆర్ఎస్ నేత కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాతనంగా వ్యవహరించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయారని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు, యువ వికాసం పథకం, వికలాంగుల పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలు అమలు చేయడం మానేసి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు చేస్తే ప్రజలు సంతోషిస్తారని అనుకోవడం విడ్డూరం అన్నారు. అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం వస్తున్నాడని స్థానిక నాయకులను ముందస్తు అరెస్టు చేయించడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘట్‌కేసర్ లో వంతెన నిర్మాణ పనుల విషయంలో ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేయాలని అనుకోవడంలో తప్పేమిటని ప్రశ్నించారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పనితీరును గమనిస్తున్నారని, అహంకారపూరిత ధోరణితో పతనం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్లు జక్కా వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బద్దం జగన్ రెడ్డి, రెడ్యా నాయక్, మాధవరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అన్నూభాయ్, అర్జున్ , ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.

Next Story