బీఆర్ఎస్ ఓ మునిగిపోయే టైటానిక్ షిప్: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజం

by Kema Shiva Kumar |

హరీశ్ రావును విచారణకు పిలిస్తే సంబరాలు చేసుకుంటున్నారని, తప్పు చేశామన్న భావన ఏ మాత్రం లేకపోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్ ఓ మునిగిపోయే టైటానిక్ షిప్: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: హరీశ్ రావును విచారణకు పిలిస్తే సంబరాలు చేసుకుంటున్నారని, తప్పు చేశామన్న భావన ఏ మాత్రం లేకపోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. ‘మాట్లాడటానికి కొంచమైనా సిగ్గు ఉండాలి.. తెలంగాణ ప్రజలను వంచించారు. సీఎంగా కేసీఆర్ మాట్లాడినన్ని బూతులు ప్రపంచంలోనే ఎవరూ మాట్లాడి ఉండరు’అని మండిపడ్డారు. ఇవాళ సీఎల్పీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో డ్రోన్ కేసు పెట్టి మా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు, మా నాయకులపై అనేక కేసులు పెట్టారు. బీఆర్ఎస్‌లో ప్రస్తుతం మూడు ముక్కలాట నడుస్తోంది. కుటుంబ ప్రయోజనం తప్ప పార్టీలోని ఇతర నాయకులకు ఏమీ తెలియదు. ఇంగ్లీష్ అంటే నేనే అని కేటీఆర్ ఫీల్ అవుతున్నాడు.. బీఆర్ఎస్ పేరును 'ఇంగ్లీష్ రాష్ట్ర సమితి’ అని పెట్టుకో కేటీఆర్ అని హితవు పలికారు.

బీఆర్ఎస్ నాయకులు కాలకేయుల్లా తయారయ్యారని, మంత్రివర్గం కలిసికట్టుగా ఉండటం వారు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తలుచుకుంటే బీఆర్ఎస్ నాయకులు వారానికోసారి విచారణకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘రాజకీయం అంటే కక్ష సాధింపు కాదని మా సీఎం అన్నారు. మా ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. బీఆర్ఎస్ చచ్చిన పాము.. ఇంకా కక్ష సాధింపు ఎందుకు?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ షిప్ లాగా మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పిచ్చి ప్రలాపనలు ఆపాలని, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. కుంభకోణాల్లో ఉన్న కేటీఆర్ మమ్మల్ని దొంగ అని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ నాయకులది భస్మాసుర హస్తమని, వారి పార్టీని వాళ్లే నాశనం చేసుకుంటున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు.

Next Story