మున్సిపల్ ​ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ నిర్ణయం

by Malleboina Mahesh |   (  Updated:2026-01-18 02:25:54  IST  )

మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఎమ్మెల్యేలు అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ చార్జీలకే మున్సిపల్ ఎన్నికల టికెట్లు కేటాయించే అధికారం ఇవ్వాలని నిర్ణయించింది.

మున్సిపల్ ​ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఎమ్మెల్యేలు అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ చార్జీలకే మున్సిపల్ ఎన్నికల టికెట్లు కేటాయించే అధికారం ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాన్ని పార్టీ పెద్దలకు సైతం తెలియజేశారు. అయితే మీకు కావాల్సిన వారు, కచ్చితంగా గెలుస్తామని ధీమా ఉన్నవారికి టికెట్ నిరాకరిస్తే తాము చూసుకుంటామని అభయమిచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతోనే ఓడిపోయామని బీఆర్ఎస్ ముఖ్యులు అనేక సభలు, సమావేశాల్లో బహిరంగంగానే చెప్పారు.

కొందరిని మార్చితే మళ్లీ అధికారంలోకి వచ్చేవాళ్లమన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయినా కూడా మున్సిపల్ టికెట్ల బాధ్యతలను మళ్లీ వారికే అప్పగిస్తే ఎలాగని కేడర్ ప్రశ్నిస్తున్నది. ఎమ్మెల్యేలు ఉన్న చోట వారికే బాధ్యతలు ఇచ్చి మిగతా నియోజకర్గాల్లో ముగ్గురు నలుగురితో కమిటీ వేసి అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరుతున్నారు. ఇవేవీ కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే పార్టీకే నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.

గ్రూపు తగాదాలతో తలనొప్పి

రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు రెండు మూడు వర్గాలుగా ఉన్నారు. మహబూబాబాద్, భూపాలపల్లి, షాద్​నగర్, కాగజ్​నగర్, ఆలేరు, నాగార్జునసాగర్, మునుగోడు తదితర నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్రూపుల ఉండటంతో కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ స్పీకర్​మధుసూదనాచారి మధ్య నాయకత్వ పోరు నడుస్తున్నది. తాము చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని మధుసూదనాచారి పట్టుబడుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. వారిద్దరినీ కేటీఆర్​ కూర్చోబెట్టి మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదని తెలిసింది. ఆ తర్వాత వరంగల్​ఈస్ట్, మహబూబాబాద్ ​నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఉండేది.

బీఆర్ఎస్ అధికారం పోగానే వరంగల్​ఈస్ట్​నుంచి పలువురు కాంగ్రెస్​లోకి వెళ్లడంతో నాయకత్వ సమస్య సమసింది. కానీ మహబూబాబాద్​అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం సద్దుమణగలేదని తెలిసింది. ఇక్కడ ఇన్ చార్జీగా మాజీ ఎమ్మెల్యే శంకర్​నాయక్​ఉండగా ఇదే నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావు తో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ​ఉన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఎమ్మెల్సీ నవీన్​కుమార్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది.

సర్పంచ్​ ఎన్నికల్లో ఇద్దరు నేతల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఇద్దరు నేతలు కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాగజ్​నగర్ లో ఓడిపోయిన కోనేరు కోనప్ప, బీఎస్పీ నుంచి పోటీచేసి ప్రస్తుతం పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ గ్రూపుల మధ్య పోటీ నడుస్తున్నది. తాము చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఆలేరులో భిక్షమయ్యగౌడ్, గొంగిడి సునీత మధ్య, మునుగోడులో ప్రభాకర్​రెడ్డి పాల్వాయి రజనీ రెడ్డి, నాగార్జునసాగర్​లో మాజీ ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఆధిపత్యపోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ మారిన చోట

మరికొన్ని నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేక కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుచోట్ల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ఆశించిన ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇంకా పూర్తిస్థాయిలో నాయకత్వంపై ఏకాభిప్రాయం రాలేదు. పక్క నియోజకవర్గాల నుంచి నాయకులను అక్కడ నిలబెట్టడం, లేక తాత్కాలికంగా కొందరు నాయకులను ప్రోత్సహిస్తున్నామని వారు చెబుతున్నారు. ఇలాంటి చోట్ల సరికొత్త సమస్యలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. కొందరిని సూచాయగా చెప్పిన వారికి ఇంకా పూర్తిస్థాయి పట్టురాకపోవడంతో అక్కడ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది.

Next Story