- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రిక్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సదస్సులో హైడ్రాకు ప్రశంసలు
‘ఈరోజు సన్నద్ధత… రేపటి భద్రత అనేది హైడ్రా గట్టిగా నమ్మడమే కాదు.. ఆచరించి చూపుతోంది’ అని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఈరోజు సన్నద్ధత… రేపటి భద్రత అనేది హైడ్రా గట్టిగా నమ్మడమే కాదు.. ఆచరించి చూపుతోంది’ అని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అన్నారు. వర్షాకాలం వరదల నియంత్రణతో పాటు.. వేసవి కాలం నీటి ఎద్దడి నివారణకు చెరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయని గుర్తించి వాటి పునరుద్ధరణకు పెద్దయెత్తున కృషి చేస్తున్నామన్నారు. వరద నీరు నేరుగా చెరువులకు చేరేలా కాలువలను కూడా పునరుద్ధరిస్తున్నామన్నారు. ‘విపత్తుల నివారణ, సాంకేతికత వినియోగం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వాతావరణ మార్పుల ప్రభావాలు, విపత్తు నిర్వహణలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంశంపై ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో జూన్ 3వ తేదీ నుంచి 5 వరకు రెండో బ్రిక్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (BRICS DRR) సదస్సులో బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మూడు రోజుల సదస్సులో తెలంగాణ రాష్ట్రం తరఫున హాజరై హైడ్రా కార్యకలాపాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నగరీకరణలో చెరువులు, సహజవనరులు పెద్దయెత్తున్న దెబ్బతింటున్నాయని.. వర్షం పడితే నీరు భూమిలోకి ఇంకడం మాట అటుంచితే.. ఆ నీరు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులే నగరాల్లో వరదలకు కారణమన్నారు. చెరువులు, నాలాల పునరుద్ధరణను పెద్దయెత్తున చేపట్టిందని.. ఈ క్రమంలో ఇప్పటికే 6 చెరువులను పూర్తి చేశామని.. మరో 18 చెరువులను చేపట్టనున్నామని తెలిపారు.
హైడ్రా పనితీరుపై బ్రిక్స్ సమావేశం ఆసక్తి..
ఒక ఎకరం చెరువు సుమారు 40 లక్షల నుంచి 80 లక్షల లీటర్ల వరకు వరద నీటిని నిల్వ చేయగలదని, చెరువుల సంరక్షణ ద్వారా నగరానికి సహజ వరద నియంత్రణ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. నాలాల విస్తరణకు ముందు సికింద్రాబాద్ ప్యాట్నీ ఏరియా, అమీర్‌పేట, బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ బస్తీలలో వరద నీరు ఎలా ముంచెత్తింది.. ఆ సమస్య పరిష్కారానికి హైడ్రా చేపట్టిన చర్యలు.. తర్వాత అక్కడ పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వరా హైడ్రా కమిషనర్ వివరించారు. అలాగే బతుకమ్మకుంట, బమృకున్ ఉద్ దౌలా చెరువుతో పాటు.. మొదట విడత చేపట్టిన ఆరు చెరువులు పునరుద్ధరణకు ముందు, తర్వాత పరిస్థితులను వివరించినప్పుడు బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రతినిధులు ఆసక్తిగా వీక్షించారు. హైడ్రా ఏర్పాటై దాదాపు రెండేళ్ల సమయంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించి 2,182 ఎకరాలను కాపాడిన వివరాలు లెక్కలతో వివరించారు. వీటి విలువ సుమారు 9.48 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు రూ.80 వేల కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. హైడ్రా మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లు క్షేత్రస్థాయిలో ఎలా పని చేస్తున్నాయో వీడియోల ద్వారా చూపించారు. ప్రకృతి వైపరీత్యాలను నివారించడంతో పాటు.. పర్యావరణ పరిరక్షణకు హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమని సౌతాఫ్రికా, ఇండోనేషియాతో పాటు.. పలు దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు. దేశ రాజధానిలో 500ల వరకూ చెరువులు కబ్జాలకు గురై పార్కింగ్ యార్డులుగా మారిపోయాయని.. వాటిని పునరుద్ధరించడం సాధ్యం కాలేదని న్యూ దిల్లీ ప్రతినిధులు వాపోయారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని.. హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలను తొలగించి పునరుద్ధరించడం సాధారణ విషయం కాదని సదస్సుకు హాజరైన ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృత నిశ్చయం.. హైడ్రా పనితీరు అన్ని నగరాలకు ఆదర్శమన్నారు.
ముందస్తు చర్యలతోనే ముప్పు నివారణ..
వర్షం పడితే.. ఏ ప్రాంతాలు, రహదారులు నీట మునుగుతాయి.. అందుకు గల కారణాలను గుర్తించి ముందస్తు నివారణకు చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. వాతావరణ మార్పులు, అనియంత్రిత పట్టణీకరణ, సహజ జలవనరుల ఆక్రమణల కారణంగా దేశంలోని అనేక నగరాలు వరదల ముప్పును ఎదుర్కొంటున్నాయని అన్నారు. విపత్తులు సంభవించిన తర్వాత స్పందించడం కంటే, విపత్తులను ముందుగానే నివారించే దిశగా హైడ్రా పనిచేస్తోందన్నారు. వరద నీరు సాఫీగా సాగేలా.. నాలాలు, వరద కాలువల్లో పూడికను తొలగించడం.. చెరువుల ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు సరిగా ఉన్నాయా లేదా అనేది వర్షాకాలానికి ముందే సరి చూసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసు, మున్సిపాలిటీ, ఇరిగేషన్, విద్యుత్ ఇలా సంబంధిత శాఖలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా.. కామన్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదుకు ప్రత్యేకంగా ఫోను నంబరు కేటాయించాలన్నారు. ఈ క్రమంలో హైడ్రా ఇప్పటికే వర్షాకాల సన్నద్ధత సమావేశాలు ఏర్పాటు చేసి భారీ వర్షాలు పడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించామన్నారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల గుర్తింపు. జీఐఎస్, ఫీల్డ్ సర్వేల ఆధారంగా ప్రమాద ప్రాంతాల మ్యాపింగ్. నాలాలు, కాలువలు, డ్రెయిన్లలోని అడ్డంకుల తొలగింపు. చెరువుల నిల్వ సామర్థ్య పునరుద్ధరణ, మురుగు తొలగింపు. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే ఆక్రమణల నివారణకు హైడ్రా పెద్దపీట వేస్తోందన్నారు.






