వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో లంచం ఆరోపణలు

by Batti.Sumithra |

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించాల్సిన సిబ్బందే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో లంచం ఆరోపణలు
X

దిశ, హస్తినాపురం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించాల్సిన సిబ్బందే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ప్రసవం అనంతరం నవజాత శిశువును చూపించేందుకు, అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ చేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. బాధితుల వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన రామకృష్ణ తన భార్య శ్రీలత (19)ను ప్రసవం కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ నెల 8వ తేదీన శ్రీలత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అనంతరం ఆపరేషన్ థియేటర్ సిబ్బంది “మగబిడ్డ పుట్టాడు… బిడ్డను చూపించాలంటే, చేతికి అప్పగించాలంటే రూ.5 వేల రూపాయలు ఇవ్వాలి” అంటూ డిమాండ్ చేసినట్లు రామకృష్ణ ఆరోపించాడు.

అంత మొత్తం తమ వద్ద లేదని చెప్పడంతో సిబ్బంది ఒత్తిడి తెచ్చారని, చివరకు ఫోన్‌ పే ద్వారా రూ.2,500 చెల్లించిన తర్వాతే శిశువును తమకు అప్పగించారని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం పట్ల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పేద, మధ్యతరగతి ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు.

ఈ ఘటన పై మహేశ్వరం జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్. నాగేందర్ ను వివరణ కోరగా ఇట్టి విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ ఘటన పై ఆర్ఎంఓల టీం డా. దామోదర్ రావు, నేతృత్వంలో "యాక్షన్ కమిటీ" ఏర్పాటు చేశానన్నారు. విచారణ జరుపుతున్నామని, విచారణ తర్వాత దోషుల పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story