- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి మీద కోపం... రాత్రంతా సైకిల్ తొక్కుతూ రాష్ట్రం దాటిన బాలుడు
తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు, ఆవేశంలో ఏకంగా 100 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి పోయాడు.

దిశ, వెబ్ డెస్క్ : తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు, ఆవేశంలో ఏకంగా 100 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి పోయి ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపింది. చివరికి రైలులో మరో రాష్ట్రానికి చేరుకున్నాడు. 9వ తరగతి చదువుతున్న సదరు బాలుడు, తన తండ్రి ఏదో విషయంలో మందలించాడని మనసులో పెట్టుకుని, ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి తన సైకిల్ తీసుకుని ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. ఆవేశంతో ఏకంగా 100 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ మీదనే నంద్యాల వరకు చేరుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రొద్దుటూరు నుండి బయలుదేరిన బాలుడు రాజుపాలెం, చగలమర్రి మీదుగా నంద్యాల పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ తన వద్ద డబ్బులు లేకపోవడంతో సైకిల్‌ను అమ్ముకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యం కాలేదు. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద సైకిల్‌ను వదిలేసి, రైలు ఎక్కి కర్ణాటకలోని రాయచూర్ చేరుకున్నాడు.
మరోవైపు, బాలుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ప్రొద్దుటూరు పోలీసులు, బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరకు ఉన్న మార్గాల్లోని CCTV ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. బాలుడు ప్రయాణించిన మార్గాన్ని ట్రేస్ చేసిన పోలీసులు, అతను రాయచూర్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రాయచూర్ పోలీసుల సహాయంతో బాలుడిని క్షేమంగా అదుపులోకి తీసుకుని, ప్రొద్దుటూరుకు తీసుకువచ్చారు. తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలుడిని చూసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులు పిల్లల మనోభావాలను అర్థం చేసుకుంటూనే, వారిపై నిఘా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.






