బంగ్లాదేశ్‌లో మళ్ళీ 'జియా' శకం.. 20 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న BNP

by Malleboina Mahesh |

20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ బంగ్లాదేశ్‌లో మళ్లీ 'జియా' శకం మొదలైంది. పార్లమెంటరీ ఎన్నికల్లో 200 కంటే ఎక్కువ స్థానాల్లో ఘనవిజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న BNP.. తారిఖ్ రహ్మాన్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధం అయింది.

బంగ్లాదేశ్‌లో మళ్ళీ జియా శకం.. 20 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న BNP
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితి తర్వాత జరిగిన ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. గురువారం ఆ దేశంలోని 300 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రాత్రి నుంచే కౌంటింగ్ ప్రారంభించారు. దీంతో శుక్రవారం వెలువడిన పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల్లో 'బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ' (BNP) భారీ విజయం సాధించింది. 2006 తర్వాత, అంటే దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆ పార్టీ మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 300 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో BNP కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 151ని సునాయాసంగా దాటేసి, సుమారు 200 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ విజయంతో గత 18 నెలలుగా కొనసాగుతున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ పాలన ముగియనుంది.

ఈ ఎన్నికల్లో BNP చైర్మన్ తారిఖ్ రహ్మాన్ తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన, తాను పోటీ చేసిన ఢాకా-17, బోగ్రా-6 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 1991 నుంచి బంగ్లాదేశ్ రాజకీయాలను మహిళా నేతలే (షేక్ హసీనా, ఖాలిదా జియా) శాసిస్తుండగా, దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక పురుషుడు దేశ ప్రధాని కాబోతుండటం గమనార్హం. ఈ చారిత్రాత్మక మార్పుపై భారత్, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే తమ అభినందనలు తెలిపాయి.

Next Story