- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రీగా చేయలేం.. ‘SIR’ విషయంలో బీఎల్ఏల కండీషన్!
రాష్ట్రంలో సమగ్ర ఓటరు జాబితా రూపకల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతోన్న ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రోగ్రాం ప్రధాన రాజకీయ పార్టీలకు సవాలుగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సమగ్ర ఓటరు జాబితా రూపకల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతోన్న ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రోగ్రాం ప్రధాన రాజకీయ పార్టీలకు సవాలుగా మారింది. పార్టీ మద్దతుదారుల ఓట్లకు ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యతలను బూత్ లెవల్ ఏజెంట్లకు అప్పగించింది. అందుకోసం పార్టీలో సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఏజెంట్లు తమ పనులు వదిలేసి ‘సర్’ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
పరేషాన్‌లో లీడర్లు..
‘సర్’ కార్యక్రమం నేపథ్యంలో తమ పార్టీ మద్దతుదారుల ఓట్లకు ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు అన్ని పార్టీలు పోలింగ్ బూత్ ఏజెంట్లను నియమించాయి. వీరంతా తమకు అప్పగించిన బూత్‌లోని అర్హులైన ఓట్లు డిలీడ్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ అర్హుల ఓట్లను తొలగించే పరిస్థితులు ఉంటే సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లకు సరైన ఆధారాలు చూపించి.. జాబితాను యాథావిధిగా కొనసాగించేందుకు చొరవ చూపాలి. అందుకోసం ప్రతి బూత్‌లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? పార్టీ మద్దతుదారులు ఎందరు ఉన్నారు? అనే అంశాలపై పూర్తి అవగాహన ఉన్న సీనియర్ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమిస్తున్నారు. సుమారు వంద రోజుల పాటు జరిగే ‘సర్’ కార్యక్రమంలో ఏజెంట్ల పాత్ర కీలకంగా మారింది. దీంతో సదరు ఏజెంట్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎంతోకొంత డబ్బులు ఇవ్వకపోతే పని చేయలేమంటూ మొహం మీదనే చెప్పడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పరేషాన్‌లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.
బూత్‌కు రూ.10 వేల ఖర్చు?
ఒక్కో బూత్ ఏజెంట్‌కు కనిష్టంగా రూ.10వేలు ఇచ్చేందుకు కొన్ని పార్టీలు రెడీ అయినట్లు తెలిసింది. రూలింగ్ పార్టీకి చెందిన ఏజెంట్లు కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీలు కలిసి ఖర్చులు భరిస్తుండగా, కొన్ని జిల్లాల్లో జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గానికి 250 నుంచి 300 వరకు బూత్‌లు ఉంటాయి. కొన్ని చోట్ల బూత్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, బూత్ ఏజెంట్లు అడిగే డబ్బులకు కాస్త అటు ఇటుగా ఇచ్చి పని చేయించుకునేందుకు అన్ని పార్టీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఏజెంట్లు లేకపోతే తమ పార్టీకి చెందిన ఓట్లు గల్లంతవుతాయేమోననే భయంతోనే నేతలు ఖర్చుకు వెనకాడం లేదని టాక్ ఉంది.
గ్రేటర్‌లో కాంగ్రెస్‌కు కష్టాలు!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు పెద్దగా కేడర్ లేదు. దీంతో ఈ ప్రాంతంలోని ఏజెంట్లను నియమించడం పెద్ద సవాలుగా మారిందని చర్చ జరుగుతున్నది. నెల రోజుల కిందట అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు ‘సర్’ కార్యక్రమంలో ఏ విధంగా వ్యవహరించాలో కేడర్‌కు ట్రైనింగ్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా లీడర్లు, కార్యకర్తలు లేకపోవడంతో అలాంటి శిక్షణ కార్యక్రమాలు జరగలేదని టాక్. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలను అలర్ట్ చేసి బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలంటూ ఆదేశించినట్లు తెలుస్తోంది.






