- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ సూచనలు దేశ ఆర్థిక భద్రతకు సంబంధించినవి : రాంచందర్ రావు
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వాలే కాకుండా, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వాలే కాకుండా, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం కాదని, జీవించి దేశానికి సేవ చేయడం కూడా గొప్ప దేశభక్తి అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ సూచనలు రాజకీయ అంశాలు కావని, అవి దేశ ఆర్థిక భద్రత సామాజిక బాధ్యతలకు సంబంధించినవని స్పష్టం చేశారు. లోకల్ ఫర్ వోకల్ భావనతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం మోడీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, స్వదేశీ వినియోగం, ఇంధన పొదుపు, దేశీయ పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలు భారత ఆర్థిక భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తాయన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఖర్చుల్లో మితవ్యయం పాటించాలని, ప్రధాని స్వయంగా తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రజలు కూడా అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తిగత వాహనాలను వాడాలని, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని కోరారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ , ఇందిరా గాంధీ కూడా ఆర్థిక ఇబ్బందుల సమయంలో కఠినమైన పొదుపు చర్యలు చేపట్టారని గుర్తు చేస్తూ, తాజాగా మోడీ చేస్తున్న సూచనలను విమర్శించడం సరికాదని హితవు పలికారు. దేశాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రధాని పిలుపును తెలంగాణ ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ప్రముఖ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డా. కృష్ణారెడ్డి సప్త సూత్రాలు పై సమగ్ర విశ్లేషణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లు, విదేశీ మారక ద్రవ్య వినియోగం వంటి అంశాలను గణాంకాలతో వివరించారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, ఇంధన వినియోగంలో బాధ్యత, వంటనూనె వినియోగ నియంత్రణ, సహజ వ్యవసాయం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అంశాలు దేశ ఆర్థిక స్థిరత్వానికి ఎలా దోహదపడతాయో తెలిపారు.






