ఈశాన్యంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న బీజేపీ

by Malleboina Mahesh |

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. అస్సాంలో హ్యాట్రిక్ విజయంతో పాటు, మిగిలిన రాష్ట్రాల్లోనూ సొంతంగా లేదా మిత్రపక్షాలతో కలిసి కాషాయ జెండాను ఎగురవేసింది.

ఈశాన్యంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న బీజేపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుని తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిన్న విడుదలైన అస్సాం ఎన్నికల ఫలితాల్లో అసోంలో బీజేపీ వరుసగా మూడోసారి చారిత్రాత్మక విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ సాధించింది. సీఎం హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 126 స్థానాల్లో 82 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే కొంత కాలంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలకే ఓటర్లు పట్టం కడుతున్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌

2024 జూన్‌లో అరుణాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ 60 స్థానాలకు గాను 46 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ బీజేపీ సొంతంగా అధికారం ఏర్పాటు చేసింది. పెమా ఖండు సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మణిపూర్‌..

2022 ఫిబ్రవరి, మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 60 స్థానాలకు గాను 32 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అయితే తర్వాత ఆ రాష్ట్రంలో తలెత్తిన హింసాత్మక పరిస్థితుల కారణంగా 2025లో సీఎం ఎన్.బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడంతో బీజేపీకి చెందిన యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

త్రిపుర..

త్రిపురలో 2023 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా కాషాయ పార్టీ గెలిచింది. దాదాపు 25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమిని ఓడించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఓటర్లు ఆ పార్టీ వైపే మొగ్గు చూపారు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీకి చెందిన డాక్టర్ మాణిక్ సాహా సీఎంగా కొనసాగుతున్నారు.

మిత్రపక్షాలతో కలిసి

ఇక నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో కలిసి బీజేపీ కూటమి అధికారంలో ఉంది. అలాగే మేఘాలయ‌లో నేషనల్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలో ఉంది. దీనికి బీజేపీ మద్దతు ఉంది. సిక్కింలో క్రాంతికారి మోర్చా అధికారంలో ఉంది. ఈ పార్టీ కూడా ఎన్డీయే కూటమిలో భాగంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తాజాగా వెలువరించిన ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా బీజేపీ సత్తాచాటింది. నాగాలాండ్‌లోని కోరిడాంగ్, త్రిపురలోని ధర్మానగర్ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకున్నది. అభివృద్ధి మంత్రం, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా బీజేపీ ఈ ప్రాంతంలో తన పట్టును పటిష్టం చేసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story