బెంగాల్ రాజకీయాల్లో నవ శకం.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీ ప్రకటించిన బీజేపీ

by Malleboina Mahesh |

పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మే 9న జరగనుంది. సువేందు అధికారి సీఎం రేసులో ముందుండగా, బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

బెంగాల్ రాజకీయాల్లో నవ శకం.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీ ప్రకటించిన బీజేపీ
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) భారీ విజయం సాధించడంతో, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మే 9వ తేదీన పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి (New Chief Minister) ప్రమాణ స్వీకార కార్యక్రమం (Oath ceremony) జరుగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య (Samik Bhattacharya) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన, బెంగాల్ ప్రజలు మార్పును కోరుకున్నారని, మే 9న కొత్త శకం ప్రారంభం కానుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ విజయంతో ఇప్పుడు అందరి దృష్టి 'ముఖ్యమంత్రి ఎవరూ?' అనే అంశంపైనే నెలకొంది. సీఎం రేసులో ప్రధానంగా ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పేరు బలంగా వినిపిస్తోంది. భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై ఘన విజయం సాధించడంతో ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఆయనతో పాటు మాజీ రాష్ట్ర అధ్యక్షులు దిలీప్ ఘోష్, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, సమిక్ భట్టాచార్య పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఇతర అగ్రనేతలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని, ఒక కొత్త ముఖాన్ని కూడా తెరపైకి తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Next Story