రబ్రీదేవిపై నోరు జారిన బిహార్ సీఎం నితీష్

by Muthe.Rajitha |

బిహార్ సీఎం నితీష్ కుమార్ మరో వివాదంలో ఇరుక్కున్నారు.

రబ్రీదేవిపై నోరు జారిన బిహార్ సీఎం నితీష్
X

దిశ, వెబ్ డెస్క్ : బిహార్ సీఎం నితీష్ కుమార్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. సోమవారం లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మహిళల భద్రత, మహిళలపై నేరాలు, గతంలో ఆర్జేడీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళల అభివృద్ధి ఎలా ఉందన్న అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా నితీష్ కుమార్ ఆగ్రహంతో మాట్లాడుతూ.. ఆర్జేడీ నేత రబ్రీ దేవిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారు.

"ఈ అమ్మాయి ఏమైనా పని చేసిందా? భర్తను పదవి నుంచి తొలగించాక, ఆ అమ్మాయిని అనవసరంగా ముఖ్యమంత్రిని చేశారు" అన్న భావంలో మాట్లాడారు. రబ్రీ దేవిని "అమ్మాయి" అని పిలవడం, ఆమెను అవమానించడమే అని విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ఇలా మాట్లాడటం తగదని రాజకీయ, సామాజిక వర్గాలు అంటున్నాయి.

మరోవైపు నితీష్ వ్యాఖ్యలపై ఆర్జేడీ పార్టీ తీవ్రంగా స్పందించింది. రబ్రీ దేవి కుమారుడు, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇది కేవలం తన తల్లిపై మాత్రమే కాదు, మహిళలందరిపై అవమానమని అన్నారు. నితీష్ కుమార్ ఆలోచన విధానం వెనుకబాటుతనంగా ఉందని, ఆయనను మహిళలకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలియని వ్యక్తిగా విమర్శించారు. ఈ వ్యవహారంలో ఆర్జేడీ సభ్యులు సభలో నిరసనకు దిగగా.. సభలో గందరగోళం నెలకొంది. నితీష్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

కాగా లాలూ అరెస్టు అయిన తర్వాత 1997 నుంచి 2005 వరకు ఆయన భార్య రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. నితీష్ కుమార్ గతంలో ఆర్జేడీతో కలిసి పనిచేసి, తర్వాత విడిపోయి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి.

Next Story