కరోనా సృష్టించిన కలకలం.. ఘజియాబాద్ అక్కచెల్లెళ్ళ కేసులో బిగ్ ట్విస్ట్

by Muthe.Rajitha |

ఘజియాబాద్‌లో జరిగిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

కరోనా సృష్టించిన కలకలం.. ఘజియాబాద్ అక్కచెల్లెళ్ళ కేసులో బిగ్ ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఘజియాబాద్‌లో జరిగిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఒకేసారి 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. వీరి ఆత్మహత్య వెనుక మొదట అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ ముగ్గురు తీవ్ర డిప్రెషన్ తో జీవితాన్ని అంతం చేసుకోడానికి కరోనా మహమ్మారి కలిగించిన కల్లోలం ఒక ప్రధాన కారణమని పోలీసు అధికారులు తేల్చారు. దర్యాప్తులో బయటపడిన విషయాలు ప్రస్తుత సమాజ పోకడలపై తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి.

ఈ కుటుంబం ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్ సాహిబాబాద్ ప్రాంతంలో నివసిస్తోంది. కుటుంబ పెద్ద చేతన్ కుమార్ ఫారెక్స్ వ్యాపారం చేసేవాడు. అతడికి ఇద్దరు భార్యలు, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అంతేకాదు అతని ఇద్దరు సోదరీమణులు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. మొత్తం కుటుంబం కలిసి జీవిస్తోంది. కానీ కోవిడ్ లాక్‌డౌన్ సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో భారీగా అప్పులపాలయ్యారు. చేతన్ కుమార్‌కు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఋణాలు తీసుకున్నారు. ఇంట్లో ఆదాయం తగ్గడంతో పిల్లల చదువులు ఆగిపోయాయి. పాఠశాలకు వెళ్లకుండా పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో కుటుంబంలో గొడవలు పెరిగాయి, బంధాలు బలహీనపడ్డాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు కుమార్తెలు పూర్తిగా మొబైల్ ఫోన్లకే అతుక్కుపోయారు. ఆన్‌లైన్ గేమ్స్, వీడియోలు, ముఖ్యంగా కొరియన్ లవ్ గేమ్‌లకు బానిసలయ్యారు. తమ అసలు పేర్లను పక్కన పెట్టి కొరియన్ పేర్లు కూడా పెట్టుకున్నారు. దీనిని గమనించిన తండ్రి చేతన్ కుమార్ 10 రోజుల క్రితం వారి మొబైల్ ఫోన్లను తీసుకుని దాచేశాడు. తర్వాత వాటిని అమ్మేసి ఆ డబ్బుతో విద్యుత్ బిల్లు చెల్లించాడు. దీంతో బాలికలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గేమ్ ఆడలేకపోవడం, తమకు ఇష్టమైన ప్రపంచం దూరమవడం వల్ల మానసికంగా కుంగిపోయారు. ఇదే సమయంలో కోపంలో ఉన్న తండ్రి పెళ్లిళ్లు చేస్తానని బెదిరించడంతో వారు మరింత భయానికి గురయ్యారు.

ఈ పరిస్థితులన్నీ కలిసి బాలికలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. "మేము కొరియన్లనే పెళ్లి చేసుకుంటాం" అంటూ వారు చెప్పిన మాటలు ఇంట్లో పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. చివరకు నిషిక (16), ప్రాచి (14), పాఖి (12) ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ చేసుకోవాలనే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తమ బాధను డైరీలో రాసి, సూసైడ్ నోట్ వదిలి, తెల్లవారుజామున 2:15 సమయంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 9వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ స్పందించారు. ఆన్‌లైన్ వ్యసనం పిల్లలు, యువత మనసులపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. మొబైల్ ఫోన్, గేమ్స్‌కు బానిసైన వారు వెంటనే సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ బాలికలు చదువు లేకుండా, ఎక్కువ సమయం మొబైల్‌తో గడపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ విషాద ఘటన తల్లిదండ్రులు, సమాజం అంతా ఆలోచించాల్సిన విషయమని, పిల్లలపై సరైన శ్రద్ధ, మానసిక సహాయం ఎంతో అవసరమని స్పష్టం చేస్తోంది.

Next Story