కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం.. రంగంలోకి 11 ప్రత్యేక బృందాలు

by Malleboina Mahesh |

కాకినాడ జిల్లా శంఖవరంలో పెద్దపులి కలకలం. పులిని బంధించేందుకు 11 ప్రత్యేక బృందాల వేట. రేడియో కాలర్ ద్వారా కదలికల గుర్తింపు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.

కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం.. రంగంలోకి 11 ప్రత్యేక బృందాలు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో పులులు అడవులు వదిలి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలో అనేకం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో గత కొన్ని రోజులుగా ఒక పెద్దపులి సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. శాటిలైట్ రేడియో కాలర్ ద్వారా పులి కదలికలను అటవీ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ, దానిని బంధించడం మాత్రం వారికి సవాలుగా మారింది. సోమవారం ఈ పులి సుమారు 12 కిలోమీటర్ల మేర ప్రయాణించి, అన్నవరం సమీపంలోని ఒక మండపం వద్ద మాటు వేసింది. ఆదివారం రాత్రి ఒక గేదె దూడను వేటాడిన ఈ పులి, ప్రస్తుతం శంఖవరం మండలంలోని గౌరంపేట కొండపై తిష్ట వేసినట్లు అధికారులు గుర్తించారు.

రంగంలోకి 11 ప్రత్యేక బృందాలు

కాగా ప్రతి రోజు వేగంగా కదులుతున్న ఆ పులిని బంధించేందుకు అటవీ శాఖ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర అటవీ దళాల అధిపతి డాక్టర్ పి.వి. చలపతిరావు స్వయంగా రంగంలోకి దిగి ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. పులిని పట్టుకోవడానికి ప్రస్తుతం 11 హనుమాన్ బృందాలు, 3 ట్రాంక్విలైజింగ్ (మత్తుమందు ఇచ్చే) బృందాలు, 4 ఆర్‌ఆర్‌ఆర్‌టీ (RRRT) బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. పులి అడవిలోకి వెళ్లేలా చూడటమే తమ ప్రాధాన్యత అని, ఒకవేళ వీలుకాకపోతే దానిని బంధించి పాపికొండ నేషనల్ పార్క్ వంటి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story