డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కు షాక్.. చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాల‌యం లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-07 16:52:09  IST  )

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు‌కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది.

డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కు షాక్.. చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాల‌యం లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghuramakrishnaraju)కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ క్రియాశీల రాజకీయాల్లో, టీవీ చర్చల్లో పాల్గొంటున్నారన్న ఆరోపణలపై రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) స్పందించింది. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్‌గా ఉంటూ రాజకీయ విమర్శలు చేయడం, వివిధ టీవీ డిబేట్లలో పాల్గొనడం రాజ్యాంగ విలువల ఉల్లంఘన అని జై భీమ్ రావు భారత్ (JBP) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ (Suresh Kumar) రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం, దీనిపై తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ (CS Vijayanand)కు లేఖ ద్వారా సిఫారసు చేసింది. అయితే, డిప్యూటీ స్పీకర్ తన హోదాను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, దీనిపై తాము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తున్నట్లు JBP పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.

వాస్తవానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు చేపట్టిన వారు నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అయితే, రఘురామకృష్ణరాజు గత కొద్దికాలంగా మీడియా సమావేశాల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడటంతో పాటు, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వ్యవహారం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని జై భీమ్ రావు భారత్ పార్టీ ఆరోపించింది. తాజాగా, రఘురామపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి సిఫారసు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Next Story