కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు బిగ్ షాక్.. రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ

by Malleboina Mahesh |

MBU యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై చర్చించడానికి వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులను యాజమాన్యం, అక్కడి సిబ్బంది బంధించి, వారిపై దాడి చేసినట్లు ఐదుగురు యువకులు పోలీసులను ఆశ్రయించారు.

కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు బిగ్ షాక్.. రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసు (Kidnapping case)లో నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. MBU యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై చర్చించడానికి వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులను యాజమాన్యం, అక్కడి సిబ్బంది బంధించి, వారిపై దాడి చేసినట్లు ఐదుగురు యువకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court of Andhra Pradesh)ను ఆశ్రయించారు.

కాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో మోహన్ బాబు (Mohan Babu) పాత్రకు సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (Public Prosecutor) కోర్టుకు తెలపడంతో, కేసు కీలక మలుపు తిరిగింది. విచారణ సందర్భంగా బాధితుడి వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అందరి వాదనలు విన్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను రేపటికి (గురువారం) వాయిదా వేసింది.

ప్రస్తుతం ఈ పరిణామం టాలీవుడ్‌ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. అరెస్ట్ నుంచి ముందస్తు రక్షణ లభించకపోవడంతో, మోహన్ బాబు తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది. పోలీసుల వద్ద ఉన్న ఆధారాల తీవ్రతను బట్టి చూస్తే, రేపటి విచారణ మోహన్ బాబు భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ కోర్టు రేపు కూడా ఉపశమనం కలిగించకపోతే, పోలీసుల చర్యలు వేగవంతమయ్యే అవకాశం ఉంది.

Next Story