సైబర్ నేరాల బాధితులకు బిగ్ రిలీఫ్.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు కేంద్రం ఆమోదం

by Kema Shiva Kumar |

సైబర్ నేరాలపై స్పందనను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాల బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.

సైబర్ నేరాల బాధితులకు బిగ్ రిలీఫ్.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు కేంద్రం ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరాలపై స్పందనను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాల బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జాతీయ సైబర్ నేర నివేదిక పోర్టల్ (NCRP) లోని సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి డిజిటల్ వినియోగం అధికంగా ఉన్న రాష్ట్రాల పౌరులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. కొత్త SOP ప్రకారం.. రూ.50 వేల కంటే తక్కువ మొత్తంతో జరిగిన చిన్నస్థాయి సైబర్ మోసాల విషయంలో కోర్టు ఆదేశం లేకుండానే బాధితులకు రీఫండ్ అందే అవకాశం ఉంది. కోర్టు లేదా రిస్టోరేషన్ ఆర్డర్ లేని సందర్భాల్లో, ఆ మొత్తాలపై బ్యాంకులు విధించిన ‘హోల్డ్’లను 90 రోజుల్లోగా తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల జాప్యం తగ్గి బాధితులపై ఆర్థిక భారం తగ్గనుంది. డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ వినియోగం పెరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ నిర్ణయం ప్రత్యేకంగా ప్రాధాన్యత కలిగి ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో డిజిటల్ లావాదేవీలు పెరిగిన కొద్దీ సైబర్ మోసాల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి.

హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సేకరించిన డేటా ప్రకారం, గత ఆరు సంవత్సరాల్లో భారత్‌లో మోసం, చీటింగ్ కేసుల వల్ల ప్రజలు రూ.52,976 కోట్లకు పైగా నష్టపోయారు. ఈ గణాంకాలు సమస్య తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను పరిశ్రమ నిపుణులు స్వాగతిస్తున్నారు. జియోటస్.కామ్ (Giottus.com) సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ మాట్లాడుతూ.. ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగం మొత్తానికి అంటే ఎక్స్ఛేంజీలు, పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ అసెట్ మధ్యవర్తులు సహా ఈ SOPలో పేర్కొన్న ఏకరీతి ఫిర్యాదు పరిష్కార, నిధుల పునరుద్ధరణ వ్యవస్థ అనిశ్చితిని తగ్గిస్తుందని తెలిపారు. ఇది భాగస్వాముల బాధ్యతలను సమన్వయం చేసి, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మధ్యవర్తులు, చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయంతో కూడిన ఎస్కలేషన్ నిర్మాణం.. నిజమైన ఖాతాలపై అనవసర ఫ్రీజ్‌లను తగ్గించడంతో పాటు, నిర్ధారిత మోసాలపై వేగవంతమైన చర్యలకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

మూడు స్టేజీల ఎస్కలేషన్ విధానం..

కొత్తగా ఆమోదించబడిన SOP ద్వారా బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, స్టాక్ ట్రేడింగ్ యాప్‌లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు సైబర్ నేర ఫిర్యాదు నమోదైనప్పుడు అనుసరించాల్సిన నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రక్రియను ఏర్పాటు చేశాయి. అలాగే, ఫ్రీజ్ అయిన ఖాతాలు లేదా నిధులకు సంబంధించిన కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం మూడు స్థాయిల ఎస్కలేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. SOPలో విధానపరమైన ఏకరీతికి ఇచ్చిన ప్రాధాన్యత వేగంగా డిజిటల్ వైపు దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఇది సురక్షితమైన, నమ్మదగిన డిజిటల్ ఫైనాన్స్ అనే ప్రభుత్వ విస్తృత లక్ష్యానికి మద్దతునిస్తూ వినియోగదారుల ఇబ్బందులను తగ్గిస్తుందని విక్రమ్ సుబ్బురాజ్ పేర్కొన్నారు. I4C ఆధ్వర్యంలో 2021లో ప్రారంభమైన CFCFRMS ద్వారా ఆర్థిక మోసాలను వెంటనే నివేదించే అవకాశం లభించడంతో పాటు, మోసగాళ్లు నిధులను తరలించకుండా అడ్డుకోవచ్చు. గతేడాది అక్టోబర్ 31 నాటికి, ఈ ప్లాట్‌ఫారమ్‌లో నమోదైన 23 లక్షలకు పైగా ఫిర్యాదుల ద్వారా రూ.7,130 కోట్లకు పైగా సొమ్మును కాపాడగలిగారు.

Next Story