‘భూభారతి దందా.. 15 మండలాల్లో కోట్లాది రూపాయలు స్వాహా

by Malleboina Mahesh |

యాదాద్రి భువనగిరి జిల్లాలో ‘భూభారతి’ కుంభకోణం! సాఫ్ట్‌వేర్ మానిప్యులేషన్ ద్వారా కోట్ల దోపిడీ. తహశీల్దార్ల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు.

‘భూభారతి దందా.. 15 మండలాల్లో కోట్లాది రూపాయలు స్వాహా
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసిన భూభారతి కుంభకోణం జిల్లావ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఈ వ్యవహారంలో తహశీల్దార్ల సంతకాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కొంత మంది డాక్యుమెంట్ రైటర్లు, కామన్ సర్వీస్ సెంటర్ నిర్వహకులు సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేసి లక్షలాది రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పక్కదారి పట్టించిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఆ ప్రక్రియ అంతా తహశీల్దార్ల సంతకాలతోనే ముగియడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన సీటులో ఉండి, రివర్స్ ఎండార్స్‌మెంట్‌ను సరిచూసుకోకుండా సంతకాలు చేయడం వల్లే ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రెవెన్యూ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.

హ్యాకింగ్ ముసుగు

జిల్లాలోని దాదాపు 15 మండలాల్లో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల పర్వం కొనసాగింది. కొంత మంది డాక్యుమెంట్ రైటర్లు, కొంత మంది సీఎస్సీ నిర్వహకులు ఒక ముఠాగా ఏర్పడి, రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను ఆసరాగా చేసుకున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో కేవలం నామమాత్రపు మొత్తాన్ని చెల్లించి, టెక్నికల్ మానిప్యులేషన్ ద్వారా పూర్తి మొత్తం చెల్లించినట్లుగా రసీదులు సృష్టించారు. ఇలా ప్రభుత్వం కళ్లు కప్పి కోట్ల రూపాయలను తమ జేబుల్లోకి మళ్లించుకున్నారు. ఈ విషయం బయటపడటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 15 మండలాల తహశీల్దార్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి డాక్యుమెంట్ రైటర్లను, ఆపరేటర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో కింది స్థాయి సిబ్బందిని బలిపశువులను చేసి, ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.

తహశీల్దార్లదే కీలక పాత్ర

ఈ కుంభకోణంలో ప్రధానంగా తహశీల్దార్ల పాత్ర పైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తహశీల్దార్ ఆమోదం అనేది అత్యంత కీలకమైన ఘట్టం. సాఫ్ట్‌వేర్ హ్యాక్ అయి ఉండవచ్చు, ఆపరేటర్లు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చు, కానీ తుది సంతకం చేసే అధికారిగా తహశీల్దార్ కనీస బాధ్యతను ఎందుకు విస్మరించారనేది అంతుచిక్కని ప్రశ్న. రిజిస్ట్రేషన్ సమయంలో ‘రివర్స్ ఎండార్స్‌మెంట్’ అనే ప్రక్రియ ఉంటుంది. ఇందులో ప్రభుత్వానికి ఎంత నగదు జమ అయింది, ఏంటి అనే పూర్తి వివరాలు ఉంటాయి. తహశీల్దార్లు ఈ ఎండార్స్‌మెంట్‌ను ఒక్క నిమిషం పాటు సరిచూసుకుని ఉంటే, అక్కడ జరిగిన మోసం ఇట్టే బయటపడేది. కానీ, ఏ మాత్రం పట్టింపు లేకుండా, సంతకాలు పెట్టడం వల్లే ఆ డాక్యుమెంట్లు లీగల్ గా చలామణిలోకి వచ్చాయి. ఒకవేళ తహశీల్దార్లు సంతకాలు చేయకుండా అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే, ఈ కుంభకోణం అసలు జరిగేదే కాదని, ప్రభుత్వానికి ఈ స్థాయిలో నష్టం వాటిల్లేది కాదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ప్రజా ధనం వృథా

ఈ భూభారతి కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం హారతైపోయింది. కేవలం ఆపరేటర్లను, రైటర్లను జైలుకు పంపితే సరిపోదని, ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ధరణి ఆపరేటర్ల హస్తం ఉందని చెబుతున్న అధికారులు తమ విధి నిర్వహణలో ఎలా విఫలమయ్యారనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు ఎంతవరకు విచారణ జరిపి, అసలైన సూత్రధారులను బయటకు తీస్తారో లేదో వేచి చూడాలి.

Next Story