భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూభారతి’ రీ సర్వే: ఆర్డీవో

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని కొడవటూరు గ్రామంలో భూభారతి భూ రీ సర్వేపై తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూభారతి’ రీ సర్వే: ఆర్డీవో
X

దిశ, బచ్చన్నపేట: మండల పరిధిలోని కొడవటూరు గ్రామంలో భూభారతి భూ రీ సర్వేపై తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నీల కవిత మురళి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా జనగామ ఆర్డీవో గోపి రామ్ నాయక్, ఎమ్మార్వో ఇంద్రవెల్లి హుస్సేన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో గోపి రామ్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన భూభారతి చట్టం ద్వారా ప్రతి భూభాగానికి సరిహద్దులు నిర్ధారించి శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికత మరియు డ్రోన్ల సహాయంతో జరిగే ఈ డిజిటల్ రీ సర్వే ద్వారా రైతులకు ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. ప్రతి భూమికి జీపీఎస్ ఆధారిత ల్యాండ్ మ్యాప్, యూనిక్ ఐడీ కేటాయింపు.

సరిహద్దు తగాదాలు పూర్తిగా తొలగి పోవడం, డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలకు అడ్డుకట్ట పడటం. భూమి కొలతలు పూర్తయ్యాక అప్డేట్ చేసిన డిజిటల్ పత్రాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నేరుగా చూసుకునే సదుపాయం. సర్వే నిర్వహించే సమయంలో రైతులు, గ్రామస్తులు స్వయంగా హాజరై, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సహకరించి తమ భూముల రికార్డులను, యాజమాన్య హక్కులను సరిచూసుకోవాలని ఆర్డీవో సూచించారు. అనంతరం ఎమ్మార్వో ఇంద్రవెల్లి హుస్సేన్ మాట్లాడుతూ.. గ్రామ రెవెన్యూ యంత్రాంగం సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ జె,మహేందర్, ఉప సర్పంచ్ గంగం దయాకర్ రెడ్డి, జీపీవో శ్రీలత, గ్రామ సెక్రటరీ మరియు రైతులు పాల్గొన్నారు.

Next Story