IPL పేరుతో సైబర్ నేరాలు.. సజ్జనార్ హెచ్చరిక

by Muthe.Rajitha |

ఐపీఎల్ క్రికెట్ ను అడ్డం పెట్టుకుని అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్న సైబర్ ముఠాల పట్ల సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేసారు.

IPL పేరుతో సైబర్ నేరాలు.. సజ్జనార్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను అడ్డం పెట్టుకుని అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్న సైబర్ ముఠాల పట్ల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేసారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు (Influencers) కేవలం తమ స్వలాభం కోసం, నిర్వాహకులు ఇచ్చే కమీషన్ల కోసం 'ఫేక్ ప్రిడిక్షన్' ఛానెళ్లను ప్రమోట్ చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు. "టాస్ ఎవరు గెలుస్తారు?", "ఏ టీమ్ విజయం సాధిస్తుంది?" వంటి వివరాలను తాము ముందే ఖచ్చితంగా చెబుతామంటూ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరమని ఊరిస్తూ, చివరికి వారిని తీరని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తున్నారని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం డబ్బు కోసం అసత్య ప్రచారాలు చేస్తూ యువతను బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్న ఇన్‌ఫ్లూయెన్సర్ల తీరుపై పోలీసులు నిశితంగా నిఘా ఉంచారు.

ఈ నెట్‌వర్క్‌ను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపింది. గత నెల రోజుల్లోనే సుమారు 494 పెయిడ్ ప్రకటనలను (Paid Ads) గుర్తించి తొలగించడమే కాకుండా, వీటిని విపరీతంగా ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించారు. క్రికెట్ బెట్టింగ్ అనేది చట్టవిరుద్ధమని, ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానెళ్ల మాటలు నమ్మి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నిఘా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, వీటి వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు నిరంతరం కొనసాగుతుందని, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినోదం కోసం చూసే క్రికెట్‌ను వ్యసనంగా మార్చుకుని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని వారు సూచిస్తున్నారు.

Next Story