ఆ నైతిక హక్కు బండి సంజయ్‌కు లేదు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

by Malleboina Mahesh |

ఉమ్మడి ఆదిలాబాద్‌కు కీలకమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండిపడ్డారు.

ఆ నైతిక హక్కు బండి సంజయ్‌కు లేదు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించినట్లు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు ఎంతో కీలకమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బండి సంజయ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు. తెలంగాణ నుంచి గెలిచిన కేంద్ర మంత్రులు కేవలం ఓట్ల కోసమే కాకుండా, రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టులను తీసుకురావాలని హితవు పలికారు.

కేసీఆర్, పవన్ కళ్యాణ్‌పై వేముల విమర్శలు

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని వేముల వీరేశం ఆరోపించారు. గత పదేళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీకి మొదటి నుంచి వ్యతిరేకత ఉందని, నాడు సోనియా గాంధీ ఇక్కడి బిడ్డల బలిదానాలను ఆపడానికే రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు తెలంగాణపై నిజమైన ప్రేమ ఉంటే జూన్ 2న అమరవీరులకు నివాళులర్పించేవారని, కానీ ఆయన ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.

దళితులకు 3 ఎకరాలు, దళిత సీఎం, ఇంటికో ఉద్యోగం వంటి ఏ ఒక్క హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. అలాగే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వెనుక బీజేపీ-బీఆర్ఎస్ రాజకీయ ఆట ఉందని ప్రజలు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా వెన్నుదన్నుగా ఉంటారని వేముల వీరేశం స్పష్టం చేశారు.

Next Story